![]() |
![]() |

శోభన్‌బాబు తర్వాత ఫ్యామిలీ స్టార్‌గా మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన జగపతిబాబు.. ఆ ఇమేజ్‌ను ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. వరుస ఫ్లాపులు చుట్టుముట్టడంతో హీరోగా లాభం లేదనుకొని, మొదట 'లెజెండ్'తో విలన్‌గా ఓ ప్రయోగం చేశారు. పైగా అంతకు ముందు హీరోగా అందుకున్న పారితోషికాని కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నారు. విలన్ ఎక్స్‌పెరిమెంట్ బ్లాక్‌బస్టర్ హిట్టవడంతో ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన చేతిలో ఎప్పుడూ సినిమాలు ఉంటున్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాల్లోనూ ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి.
మరోవైపు సోషల్ మీడియాలోనూ జగ్గూభాయ్ పేరుతో యమ యాక్టివ్‌గా ఉంటున్నారు జగపతి. తన యాక్టివిటీస్‌ను అభిమానులతో పంచుకుంటూ రావడమే కాకుండా రకరకాల పోజులతో పిక్చర్స్ షేర్ చేసి, వాటికి ఆసక్తికరమైన క్యాప్షన్స్ జోడించడం ఆయనకు సరదా. లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆయన షేర్ చేసిన ఫొటో అందరి దృష్టినీ ఆకర్షించింది. అందులో పొలిటీషియన్ మాదిరిగా వైట్ అండ్ వైట్ లాల్చీ, కుర్తా ధరించి గోడమీద కూర్చొని ఉన్నారు. చేతిలో బ్లాక్ గాగుల్స్ ఉన్నాయి. క్యాప్షన్ పెట్టకపోతే, రాజకీయ నాయకుడి అవతారం ఎత్తుతున్నారని జనం అనుకుంటారని అనుకున్నారేమో, దానికి "Definitely not aspiring to be a politician." అనే క్యాప్షన్ పెట్టారు.

ఏదేమైనా ఆ లుక్‌లో ఆయన అచ్చు రాజకీయ నాయకుడిలానే కనిపిస్తున్నారని అభిమానులు ఫీలవుతున్నారు. కొంతమంది రాజకీయాల్లోకి రావాల్సిందిగా సూచిస్తున్నారు కూడా.
కొన్ని వారాల క్రితం ఆయన కరోనాకు మందు ఇస్తున్న ఆనందయ్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. "మనల్ని కాపాడ్డానికి తల్లి ప్రకృతి ముందుకు వస్తున్నట్లుగా ఉంది. ఆనందయ్యగారి వైద్యం అధికారికంగా అనుమతి పొంది, ఈ ప్రపంచాన్ని రక్షించాలని ప్రార్థించండి. ఆయనను దేవుడు ఆశీర్వదించాలి." అని ఆయన రాసుకొచ్చారు.
![]() |
![]() |