Home

»

Latest News

మ‌ల‌యాళం సెన్సేష‌న‌ల్ హిట్ 'క‌ప్పేలా' రీమేక్ లాంఛ‌నంగా మొద‌లైంది

Jul 7, 2021 3:57PM

 

'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్' త‌ర్వాత మ‌రో మ‌ల‌యాళ రీమేక్‌ను ప్రారంభించారు సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ. మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీ లెటెస్ట్ సెన్సేష‌నల్ హీరోయిన్ అన్నా బెన్ ప్ర‌ధాన పాత్ర పోషించగా ఘ‌న‌విజ‌యం సాధించిన‌ 'క‌ప్పేలా' రీమేక్ హ‌క్కుల్ని ఇదివ‌ర‌కే ఆ సంస్థ పొందింది. బుధ‌వారం (జూన్ 7) హైద‌రాబాద్‌లో ఆ సినిమా రీమేక్ ప‌నులు లాంఛ‌నంగా మొద‌లయ్యాయి. దేవుని ప‌టాల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు షాట్‌కు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ క్లాప్ కొట్టారు. 

శౌరి చంద్రశేఖర్ టి. రమేష్ దర్శకుడిగా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అర్జున్ దాస్ ('మాస్ట‌ర్' ఫేమ్‌) కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయనకు తెలుగులో ఇదే తొలి చిత్రం. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్టును దర్శకునికి అందించారు. "గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. 'ప్రేమ' లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి." అని చెప్పాడు దర్శకుడు శౌరి చంద్రశేఖర్ టి. రమేష్.

హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఆగ‌స్టులో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. గ‌ణేశ్‌కుమార్ రావూరి మాట‌లు రాస్తున్న ఈ చిత్రానికి వంశీ ప‌చ్చిపులుసు ఛాయాగ్రాహ‌కుడు. స్వీకార్ అగ‌స్తి సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com