![]() |
![]() |
.jpg)
మరో రెండు నెలల్లో రానున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పోటీ ఈసారి రసవత్తరంగా మారనున్నది. మా అధ్యక్ష రేసులో ఈసారి విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్, యంగ్ హీరో మంచు విష్ణు నిలవడం ఖాయమైంది. మెగా కాంపౌండ్ మద్దతుతో ప్రకాశ్‌రాజ్ ఓ అడుగు ముందుకేశారు. పక్కా ప్రణాళికతో వెళ్తున్నారు. అందులో భాగంగా 27 మంది అభ్యర్థులతో తన ప్యానల్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో లోకల్, నాన్-లోకల్ అనే తేడాను తీసుకొచ్చి ప్రకాశ్‌రాజ్‌ను బలహీనపరచాలని కొంతమంది ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నటి కరాటే కల్యాణి నాన్-లోకల్ అయిన ప్రకాశ్‌రాజ్‌ను మా అధ్యక్షుడిగా అంగీకరించమని ప్రకటించారు. మరికొందరు కూడా ఆమెకు వంత పాడుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్‌తో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ప్రకాశ్‌రాజ్ లోకలా, నాన్‌లోకలా అనేది అర్థరహితమైన వాదన అని తేల్చేశారు. నాలుగేళ్లుగా మా మసకబారిందనీ, బయట దాని గౌరవం తగ్గిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కాలంలో మాకు అధ్యక్షులుగా శివాజీరాజా, సీనియర్ నరేశ్ పనిచేయడం గమనించదగ్గ అంశం.
"మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు సొంత బిల్డింగ్ ఉండాలి, అది తమదిగా నటులందరూ భావించాలి అని రెండు నెలల క్రితం ప్రకాశ్‌రాజ్ నాతో చెప్పారు. 'మా'ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో ఆయన దగ్గర కార్యాచరణ ఉంది." అని నాగబాబు తెలిపారు. ప్రకాశ్‌రాజ్ అన్ని భాషలతోనూ అనుబంధం ఉన్న వ్యక్తి అనీ, ఎవరితోనైనా, ఏ పనైనా చేయించుకోగలిగే చాకచక్యం ఉందనీ మెచ్చుకున్నారు. "కొంతకాలంగా ఆయన సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. గ్రామాలను దత్తత తీసుకొని సర్వీస్ చేస్తుండటం చూసి నాకు ముచ్చటేసింది. తన దగ్గర పనిచేసేవాళ్లకు కూడా ఇళ్లు కట్టించి ఇచ్చిన సహృదయుడు. ఇలాంటి వ్యక్తి మాతో ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుంది." అన్నారు నాగబాబు.
లోకల్, నాన్-లోకల్ అనేది అర్థరహితమైన వాదన అని ఆయన అన్నారు. 'మా'లో మెంబర్ అయిన ప్రతి వ్యక్తికీ ప్రెసిడెంట్ దగ్గర్నుంచీ ప్రతి పదవికీ పోటీ చేసే హక్కు ఉంటుందని చెప్పారు. "ముందు.. మనం తెలుగు యాక్టర్లం కాదు, ఇండియన్ యాక్టర్లం. మేమంతా ఇండియన్ యాక్టర్లం. ప్రకాశ్‌రాజ్ ఎక్కడ పుట్టాడనేది అనవసరం. ఆయన తెలంగాణలో మూడు గ్రామాలు దత్తత తీసుకొని, లోకల్ పర్సన్‌గా సెటిల్ అయిన వ్యక్తి. లోకల్‌కు, నాన్-లోకల్‌కు ప్రామాణికత ఏంటి? ఎన్నేళ్లు ఉంటే లోకల్ అవుతాం? అమెరికాలో పదేళ్లు ఉంటే అక్కడి పౌరసత్వం వస్తుంది. అక్కడ నాన్‌లోకల్ అనే ఫీలింగ్ ఉంటే కమలా హారిస్ అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ అయ్యేవాళ్లు కాదు. పెద్దవాళ్లకే లేని నాన్‌లోకల్ ఫీలింగ్ ఒక కుటుంబంలా ఉండే మనకెందుకు?" అని నాగబాబు వాదించారు.
మనకు కావాల్సింది ఓ మంచి వ్యక్తి అనీ, ప్రకాశ్‌రాజ్ మంచి వ్యక్తి అనీ చెప్పారు. "ఆయన గొప్ప యాక్టర్. అంతకు మించి మంచి హృదయం ఉన్న మనిషి. మేమంతా ప్రకాశ్‌రాజ్‌కు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. అన్నయ్య ఆశీర్వాదాలు కూడా మాకున్నాయి. అయితే తాను డైరెక్టుగా ఇన్‌వాల్వ్ కానని ఆయన చెప్పారు. గత నాలుగేళ్ల నుంచీ మా మసకబారింది. బయట మా గౌరవం కొంచెం తగ్గింది. ఆ గౌరవం తగ్గకుండా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మేమంతా ప్రకాశ్‌రాజ్‌కు సపోర్ట్ చేస్తున్నాం." అని స్పష్టం చేశారు నాగబాబు.
![]() |
![]() |