Home

»

Latest News

వెంకీ `గ‌ణేష్`కి 23 ఏళ్ళు!

Jun 19, 2021 12:06PM

``ఎనీ సెంట‌ర్.. సింగిల్ హ్యాండ్.. గ‌ణేష్``.. అంటూ విక్ట‌రీ వెంక‌టేశ్ అల‌రించిన చిత్రం `గ‌ణేష్`. వెంకీలోని న‌టుడ్ని కొత్త కోణంలో ఆవిష్క‌రించిన ఈ సినిమాతో తిరుప‌తి స్వామి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై డి. రామానాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో డి. సురేశ్ బాబు నిర్మించిన ఈ యాక్ష‌న్ డ్రామాలో వెంకీకి జోడీగా రంభ న‌టించగా.. మ‌ధుబాల‌, రేవ‌తి, కోట శ్రీ‌నివాస‌రావు, చంద్ర‌మోహ‌న్, కీర్త‌న‌, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, ఆహుతి ప్ర‌సాద్, చ‌ల‌ప‌తిరావు, బ్ర‌హ్మానందం, బాబూమోహ‌న్, అలీ, వేణుమాధ‌వ్, న‌ర‌సింహ‌రాజు, ర‌మాప్ర‌భ‌, తెలంగాణ శ‌కుంత‌ల త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో అల‌రించారు.

అవినీతిప‌రులైన రాజ‌కీయ‌నాయకుల కార‌ణంగా త‌న కుటుంబాన్ని, భ‌విష్య‌త్ ని కోల్పోయిన గ‌ణేష్ అనే జ‌ర్న‌లిస్ట్.. త‌న ప్ర‌తీకారం ఎలా తీర్చుకున్నాడు?  వ్య‌వ‌స్థ‌లో ఎలాంటి మార్పును తీసుకొచ్చాడు? అనే క‌థాంశంతో `గ‌ణేష్` తెర‌కెక్కింది. సామాజికాంశాల‌తో రూపొందిన ఈ సినిమాకి `తృతీయ ఉత్త‌మ చిత్రం`, `ఉత్త‌మ న‌టుడు`, `ఉత్త‌మ ప్ర‌తినాయ‌కుడు` (కోట‌), `ఉత్త‌మ మాట‌ల ర‌చ‌యిత‌` (ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్), `ఉత్త‌మ క‌ళా ద‌ర్శ‌కుడు` (రాఘ‌వ‌) విభాగాల్లో `నంది` పుర‌స్కారాలు ద‌క్కాయి. అలాగే `ఉత్త‌మ న‌టుడు` విభాగంలో `ఫిల్మ్ ఫేర్` అవార్డుని సైతం అందుకున్నారు వెంకీ.

మెలోడీబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ పాట‌లు, నేప‌థ్య సంగీతం ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. ``సిరి సిరి మువ్వ‌లు``, ``రాజ‌హంస‌వో``, ``హిందీలోన చుమ్మా``, ``అయ్యోరామ‌``, ``ఆదా బ‌ర్ సే``.. ఇలా ఇందులోని పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. 1998 జూన్ 19న విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన `గ‌ణేష్`.. నేటితో 23 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com