![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ మంచి మనసున్న వ్యక్తి అని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ప్రచారం చేసుకోకుండా ఎందరికో ఆయన సాయం చేస్తుంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. నేడు(జూన్ 10) బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సింగర్ స్మిత ఓ వీడియో ద్వారా ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. అంతేకాదు కేవలం ఒక్క మెసేజ్ చేస్తే బాలయ్య ఒక జర్నలిస్ట్ కుమారుడి ప్రాణాలు ఎలా కాపాడారో ఆ వీడియోలో స్మిత వివరించారు.
"రెండు నెలల క్రితం ఓ జర్నలిస్టు నుంచి నాకు కాల్ వచ్చింది. తన జర్నలిస్టు ఫ్రెండ్ కొడుక్కి ఆరోగ్యం బాగోలేదు. అతడిని బతికించేందుకు ఆ కుటుంబ సభ్యులు ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకున్నారు. మెరుగైన ట్రీట్ మెంట్ చేయాలంటే ఇంకా చాలా డబ్బు అవసరమని వైద్యులు చెప్పారు. ఇదంతా నాకు చెప్పగానే అంత డబ్బు సమకూర్చడం నా వల్ల కాదు అని చెప్పలేకపోయాను. రెండు నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను."
"ఆ వెంటనే నేను.. సార్ ఒక రెండు నిమిషాలు మీతో మాట్లాడటానికి టైం ఇస్తారా? అంటూ బాలకృష్ణ గారికి మెసేజ్ పెట్టాను. 5 నిమిషాల్లో ఆయన ఫోన్ చేశారు. నేను జరిగిందంతా చెప్పాను. వెంటనే ఆయన రిపోర్ట్స్ పంపించు, చేయగలిగింది చేద్దాం అన్నారు. ఆ తర్వాత సరిగ్గా మూడు గంటల్లో మళ్లీ నాకు కాల్ వచ్చింది. హాస్పిటల్ నుంచి డాక్టర్స్ మాట్లాడుతూ.. భయపడాల్సిన పనిలేదు.. మొత్తం మేం చూసుకుంటాం.. పేషెంట్ ను రేపు హాస్పిటల్ కు రమ్మని చెప్పండన్నారు. నాకు చాలా సంతోషమేసింది. ఇలా ఎంతోమందికి బాలయ్య సాయం చేస్తుంటారు. కొన్ని తెలుస్తాయి. కొన్ని తెలియవు అంతే.. అందరి ఆశీర్వాదాలతో ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా" అంటూ బాలయ్యకు బర్త్ డే విషెస్ చెప్పారు స్మిత.
![]() |
![]() |