![]() |
![]() |

గంధర్వ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ ఈరోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. గాయకునిగా, డబ్బింగ్ ఆర్టిస్టునిగా మంచి పేరున్న రత్నకుమార్ సుదీర్ఘ కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ, డయాలసిస్ మీదున్నారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య స్థితి క్షీణిస్తూ వచ్చింది. చివరకు తను ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఘంటసాల గారికి ఇద్దరు భార్యల ద్వారా ఎనిమిది మంది సంతానం. వారిలో నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు. మొదటి భార్య మృతి చెందాక ఆయన రెండో వివాహం చేసుకున్నారు. రత్నకుమార్ ఆయన ద్వితీయ పుత్రుడు. గాయకునిగా కెరీర్ ప్రారంభించినప్పటికీ, డబ్బింగ్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు రత్నకుమార్. ఎనిమిది గంటల పాటు నిర్విరామంగా డబ్బింగ్ చెప్పడం ద్వారా ఆయన లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు పొందారు.
నాలుగు దశాబ్దాల కెరీర్‌లో తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, సంస్కృత భాషా చిత్రాల్లో ఆయన 1500కు పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. అలాగే తెలుగు, తమిళ సీరియల్స్ కలిపి 15 వేలకు పైగా ఎపిసోడ్లకు వాయిస్ ఇచ్చిన రికార్డ్ ఆయనది. అలాగే 50 డాక్యుమెంటరీలకు కూడా ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు.
![]() |
![]() |