![]() |
![]() |

మహానటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ లో పలు మల్టిస్టారర్స్ రూపొందాయి. వాటిలో `సత్యం శివం` ఒకటి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ చిత్రమే.. ఈ మేటి నటుల కలయికలో ఆఖరి సినిమా కావడం విశేషం. అది కూడా.. యన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగానే ఈ చిత్రం విడుదల కావడం మరింత విశేషం.
`బిగ్ బి` అమితాబ్ బచ్చన్, శశి కపూర్ నటించిన హిందీ చిత్రం `సుహాగ్`(1979) ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో శ్రీదేవి, రతి అగ్నిహోత్రి నాయికలుగా నటించగా.. విజయశాంతి, భానుచందర్, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, మోహన్ బాబు, అల్లు రామలింగయ్య, త్యాగరాజు, పుష్పలత, చలపతిరావు, మిక్కిలినేని ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
దిగ్గజ స్వరకర్త చక్రవర్తి సంగీతమందించిన ఈ చిత్రానికి దిగ్గజ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ``మంచి తరుణం``, ``వెలుగు నీడలలో``, ``మోతగున్నావో పిల్లో``, ``అందానికే అందమా``, ``ఎనకా ముందు``, ``జంబలగిరి పంబకాడ``.. ఇలా ఇందులోని పాటలన్నీ అప్పటి ప్రేక్షకులను అలరించాయి. 1981 మే 28న విడుదలైన `సత్యం శివం`.. నేటితో 40 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |