![]() |
![]() |

మే 23న 81 ఏట అడుగుపెట్టిన సీనియర్ నటుడు చంద్రమోహన్ సినిమాలకు సెలవు చెప్పేశారు. దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు అనేక రకాల పాత్రలతో.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసిన ఆ నవ్వు ముఖం నటుడు తనకు నటనానుభవం సంతృప్తినిచ్చిందని చెప్పారు. ఈ నెల 22 నుంచి రెండు రోజుల పాటు చంద్రమోహన్ పుట్టినరోజు వేడుకలు జూమ్ క్లౌడ్ మీటింగ్ ద్వారా జరిగాయి. వంశీ గ్లోబల్ అవార్డ్స్, సంతోషం మ్యాగజైన్, శారద ఆకునూరి (యు.ఎస్.) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో 14 దేశాల నుంచి 108 మంది రచయితలు పాల్గొన్నారు. చంద్రమోహన్ నటించిన 900 పైచిలుకు సినిమాల్లో 108 సినిమాల గురించి, ఆయన నటనా ప్రతిభ గురించీ విశ్లేషించారు.
కళాతపస్వి కె. విశ్వనాథ్, సీనియర్ నటి జమున, సీనియర్ నటుడు మురళీమోహన్, సీనియర్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు, రాజకీయ వేత్త మండలి బుద్ధప్రసాద్, సంతోషం పత్రిక అధినేత సురేశ్ కొండేటి ఈ వేడుకలను ప్రారంభించారు. తాను 55 సంవత్సరాల పాటు నటించాననీ, జూనియర్ ఎన్టీఆర్ సినిమా రాఖీ షూటింగ్ సమయంలో గుండెనొప్పి రావడంతో బైపాస్ సర్జరీ జరిగిందనీ ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ సినిమా దువ్వాడ జగన్నాథమ్ షూటింగ్‌లో అనారోగ్యం బారిన పడటంతో షూటింగ్‌కు ఆటంకం కలిగిందని చెప్పారు. తనకు సినీ నటనానుభవం సంతృప్తినిచ్చిందనీ, ఇక సినిమాలకు స్వస్తిచెప్పినట్లేననీ చంద్రమోహన్ భావోద్వేగభరితులయ్యారు. ఆయన భార్య, సీనియర్ రైటర్ జలంధర ఆద్యంతం ఈ వేడుకలను తిలకించారు.
![]() |
![]() |