![]() |
![]() |

ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ద ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ సీజన్ 2ను నిషేధించాలనీ, దాని విడుదలను ఆపాలనీ తమిళియన్లు డిమాండ్లు చేస్తున్నారు. ఆ సిరీస్‌లో తమిళులను టెర్రరిస్టులుగా చూపించారనేది వారి ప్రధాన ఆరోపణ. పైగా ఆ పాత్ర చేసింది ఎవరో కాదు.. టాలీవుడ్ అగ్ర తారల్లో ఒకరైన సమంత అక్కినేని. తమిళంలో మాట్లాడుతూ, ఒక టెర్రరిస్ట్ గ్రూప్ మెంబర్‌గా, సూసైడ్ బాంబర్‌గా ఆమె నటించినట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ తెలియజేసింది. జూన్ 4న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నది.
లేటెస్ట్‌గా రాజ్యసభ్య సభ్యుడు, ఎండీఎంకే నాయకుడైన వైకో ఆ షో విడుదలను ఆపాలని కోరుతూ కేంద్ర సమాచార-ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఓ లేఖ రాశారు.
దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే క్రియేట్ చేసిన 'ద ఫ్యామిలీ మ్యా'న్ ఫస్ట్ సిరీస్ 2019లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమై వీక్షకాదరణ పొందడమే కాకుండా, ఓటీటీలో పెద్ద హిట్టయిన ఇండియన్ వెబ్ సిరీస్‌గా పేరు తెచ్చుకుంది. మనోజ్ బాజ్‌పేయి మెయిన్ లీడ్‌గా నటించిన ఆ సిరీస్‌లో, ఆయన భార్యగా ప్రియమణి నటించింది. ఇప్పుడు సెకండ్ సీజన్‌లో ఆ ఇద్దరితో పాటు సమంత మెయిన్ విలన్‌గా కనిపించనున్నది.
ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో రాజీ అనే పాత్రలో సమంత కనిపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకించే పనిచేసే ఒక తిరుగుబాటు సంస్థ సభ్యురాలిగా ఆమె నటించినట్లు దానిని బట్టి తెలుస్తోంది. ఈ కొత్త సీజన్ చెన్నై నేపథ్యంలో జరుగుతుంది. బాంబుదాడులతో చెన్నైని అల్లకల్లోలం చేయడానికి వచ్చిన రాజీని అండర్‌కవర్ ఏజెంట్ శ్రీకాంత్ తివారి (మనోజ్ బాజ్‌పేయి) ఎలా అడ్డుకున్నాడనేది ఇందులోని ప్రధాన ఇతివృత్తం.
ప్రకాశ్ జవదేకర్‌కు మే 19న రాసిన లేఖలో, "తమిళులను టెర్రరిస్టులుగా, ఐఎస్ఐ ఏజెంట్లుగా, పాకిస్తాన్‌తో సంబంధాలున్నవాళ్లుగా" 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' చూపించిందని వైకో ఆరోపించారు.
![]() |
![]() |