![]() |
![]() |

నటి రాజ్యలక్ష్మి అంటే అందరూ గుర్తుపట్టక పోవచ్చేమో కానీ, 'శంకరాభరణం' రాజ్యలక్ష్మి అంటే ఎవరైనా గుర్తుపట్టేస్తారు. అమాయకంగా కనిపించే ముఖం, విశాలమైన కళ్లతో చూడగానే ఆకర్షించే రూపం రాజ్యలక్ష్మి సొంతం. కె. విశ్వనాథ్ లాంటి లెజండరీ డైరెక్టర్ రూపొందించిన క్లాసిక్ ఫిల్మ్ 'శంకరాభరణం' చిత్రం ద్వారా పరిచయమై ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చేసుకున్న రాజ్యలక్ష్మికి ఆ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
"మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఒక నటిగా చెయ్యాలని ఆశించేది. ఆమెకు నాటకాలలో మంచి అనుభవం ఉంది. నేనూ ఓ మూడునెలలు నాటకాల్లో నటించాను. కానీ నన్ను సినిమా నటిగా చూడాలన్న బలీయమైన కోరికతో మా అమ్మ నన్ను మద్రాసుకు తీసుకువచ్చింది. మొదట్లో 'సినిమా పిచ్చోళ్లు' సినిమాలో నన్ను సెకండ్ హీరోయిన్‌గా బుక్ చేస్తామన్నారు. మా అమ్మ ఒప్పుకోలేదు." అని చెప్పారు రాజ్యలక్ష్మి.
ఒకరోజు తల్లీకూతుళ్లు కె. విశ్వనాథ్ గారిని కలిశారు. "నన్ను నటించి చూపమన్నారు. అంతకు ముందు నేను నటించిన నాటకంలో ఒక సీన్‌ను నటించి చూపాను. అప్పుడేమీ చెప్పలేదు. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా నాకు నిద్రపట్టలేదు. విశ్వనాథ్ గారంత గొప్ప దర్శకులు నన్ను బుక్ చేసుకుంటారా? అసలాయనకు నా నటన నచ్చుతుందా? ఏమంటారో ఏమో?. వగైరా ప్రశ్నలతో కలత నిద్ర పోయాను." అని ఆరోజును రాజ్యలక్ష్మి గుర్తు చేసుకున్నారు.
ఆ మర్నాడు విశ్వనాథ్‌గారు ఆమెను 'శంకరాభరణం' చిత్రంలో బుక్ చేసినట్లు కబురు వచ్చింది. "నా ఆనందానికి అవధులు లేవు. నటనలో నాకు గురువైన విశ్వనాథ్ గారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఆ సినిమా తర్వాత వరుసగా నాకు అవకాశాలు వచ్చాయి." అని చెప్పుకొచ్చారు రాజ్యలక్ష్మి.
![]() |
![]() |