![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు 26 సినిమాల్లో సందడి చేశారు. అయితే, తన చిత్రాల్లో బెస్ట్ అండ్ ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ అంటే మాత్రం ఎవరైనా ఠక్కున చెప్పే పేరు.. `ఖుషి`. మెలోడీబ్రహ్మ మణిశర్మ పాటలు, మాటలు, పోరాటాలు, పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణంలో తెరకెక్కిన కనువిందైన దృశ్యాలు, కథానాయిక భూమిక అందాలు, ఎస్. జె. సూర్య దర్శకత్వ ప్రతిభ, శ్రీ సూర్య మూవీస్ వారి నిర్మాణ విలువలు.. వీటన్నింటికి మించి పవన్ కళ్యాణ్ ఛార్మింగ్ స్క్రీన్ ప్రెజెన్స్.. వెరసి `ఖుషి` టాలీవుడ్ లో ఓ కల్ట్ క్లాసిక్.
కోలీవుడ్ బ్లాక్ బస్టర్ `ఖుషి` (విజయ్, జ్యోతిక)కి రీమేక్ గా మాతృక దర్శకుడు ఎస్. జె. సూర్య తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. ఒరిజినల్ కి మించి ఎంటర్ టైన్ చేసి `వన్ ఆఫ్ ది బెస్ట్ రీమేక్స్` జాబితాలో చేరింది. ``అమ్మాయే సన్నగా``, `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`` (రీమిక్స్), ``చెలియ చెలియా``, `ప్రేమంటే సులువు కాదురా``, ``హోళీ హోళీ``, ``యే మేరా జహా``.. ఇలా `ఖుషి` సినిమాలోని ప్రతీ పాట అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించింది. మ్యూజికల్ గా సెన్సేషన్ గా నిలిచిన `ఖుషి`.. ఎన్నో రివార్డులను, రికార్డులను మూటగట్టుకుంది. 2001 ఏప్రిల్ 27న విడుదలై అఖండ విజయం సాధించిన `ఖుషి`.. నేటితో 20 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |