![]() |
![]() |

ఏప్రిల్ 17న సౌత్ ఇండియన్ టాప్ కమెడియన్లలో ఒకరైన వివేక్ మృతి చెందారనే వార్త అందరినీ షాక్‌కు గురిచేసింది. గుండెపోటుకు గురై హాస్పిటల్‌లో చేరిన మరుసటి రోజే ఆయన కన్నుమూయడంతో తమిళ చిత్రసీమ శోకసంద్రంలో మునిగింది. ఈ విషాదవార్త టాప్ స్టార్ విజయ్‌ను అమితంగా బాధపెట్టింది. అయితే ఆ సమయంలో షూటింగ్ నిమిత్తం ఆయన వేరే దేశంలో ఉండటంతో వివేక్ అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. ఇప్పుడు ఆయన ఇండియాకు తిరిగి వచ్చాడు. వచ్చీ రాగానే, చెన్నైలోని వివేక్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, నటుడి మృతిపట్ల తీవ్ర విచారాన్నీ, సంతాపాన్నీ తెలియజేశాడు.
పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన వివేక్ అంత్యక్రియలకు అనేకమంది అభిమానులతో పాటు తమిళ చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రప్రభుత్వ గౌరవ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
వివేక్‌తో పలు సినిమాల్లో కలిసి పనిచేసిన దళపతి విజయ్ ఆ టైమ్‌లో తన 65వ సినిమా షూటింగ్ సందర్భంగా జార్జియాలో ఉన్నాడు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకొని ఏప్రిల్ 25న ఆయన చెన్నైకు తిరిగి వచ్చాడు. ఈరోజు ఉదయాన్నే వివేక్ ఇంటికి వెళ్లాడు. తన హృదయం ఇప్పటికీ వివేక్ మృతిని జీర్ణించుకోలేక పోతున్నదని చెప్పిన ఆయన, ధైర్యంగా ఉండాల్సిందిగా ఆయన కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఈ సందర్భంగా వివేక్‌తో తన అనుబంధాన్ని వారితో పంచుకున్నాడు.
విజయ్, వివేక్ కలిసి ఖుషి, తిరుమలై, తమిళన్, యూత్, కురువి, ప్రియమనవాలే, నేరుక్కు నేర్, బద్రి, బిగిల్ లాంటి సినిమాల్లో నటించారు.
![]() |
![]() |