![]() |
![]() |

ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్‌గా నామినేషన్ పొందిన తొలి ముస్లింగా రిజ్ అహ్మద్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 'సౌండ్ ఆఫ్ మెటల్' మూవీలో ప్రదర్శంచిన అసమాన నటనకు గాను అతను ఈ నామినేషన్ పొందాడు. సాంస్కృతికంగా అకాడమీ అవార్డుల చరిత్రలో ఈ నామినేషన్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇదివరకు వేరే కేటగిరీల్లో ఆస్కార్ నామినేషన్లు పొందిన ముస్లింలు ఉన్నారు కానీ, బెస్ట్ యాక్టర్ నామినేషన్ పొందిన తొలి ముస్లిం మాత్రం రిజ్ అహ్మద్.
38 సంవత్సరాల రిజ్ అహ్మద్ ఇంగ్లిష్ నటుడు, సంగీతకారుడు, సామాజిక కార్యకర్త. ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్ గ్రహీత. 2009లో 'తృష్ణ' సినిమాలో ఫ్రీదా పింటోతో కలిసి నటించాడు. 2006లో 'ద రోడ్ టు గ్వాంటనామో' అనే బ్రిటిష్ మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం 'ఇన్‌వేజన్' అనే సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు నామినేషన్ పొందిన 'సౌండ్ ఆఫ్ మెటల్' మూవీలో రూబెన్ స్టోన్ అనే డ్రమ్మర్‌గా నటించాడు. డారియస్ మార్దర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి మొత్తం 6 ఆస్కార్ నామినేషన్స్ లభించాయి.
గతంలో ఇతర కేటగిరీల్లో ఆస్కార్ నామినేషన్స్ పొందిన ముస్లింలు ఎవరంటే...
1963లో 'లారెన్స్ ఆఫ్ అరేబియా' సినిమాలో నటనకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో నామినేషన్ పొందిన తొలి ముస్లిం-ఆఫ్రికన్ యాక్టర్‌గా ఒమర్ షరీఫ్ పేరు తెచ్చుకున్నారు కానీ అవార్డు గెలుచుకోలేకపోయారు.
2004లో 'హౌస్ ఆఫ్ శాండ్ అండ్ ఫాగ్' మూవీలో ప్రదర్శించిన అభినయానికి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరీలో నామినేషన్ పొందిన తొలి ముస్లింగా షోరే అఘ్దష్‌లూ కీర్తి పొందారు కానీ రెనీ జెల్‌వెగర్‌కు అవార్డును కోల్పోయారు. ఆస్కార్ హిస్టరీలోనే నామినేషన్ పొందిన ఏకైక ముస్లిం నటిగా అఘ్దష్‌లూ నిలిచారు.
2017లో 'మూన్‌లైట్'లోని పర్ఫార్మెన్స్‌కు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఆస్కార్ అవార్డ్ అందుకోవడం ద్వారా ఆ ఘనత సాధించిన తొలి ముస్లింగా మహర్షలా అలీ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు, 2020లో 'గ్రీన్ బుక్' మూవీలో యాక్టింగ్‌కు రెండోసారి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా అవార్డు అందుకొని రెండు ఆస్కార్లు సాధించిన తొలి ముస్లిం నటుడిగా మరో రికార్డును సాధించాడు.
ఇక ఇండియాకు చెందిన ఎ.ఆర్. రెహమాన్ రెండు ఆస్కార్లు అందుకున్న తొలి ముస్లిం మ్యూజిక్ డైరెక్టర్‌గా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించాడు. 2009లో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' మూవీ చిత్రానికి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీల్లో ఆస్కార్లు అందుకున్నాడు రెహమాన్.
![]() |
![]() |