![]() |
![]() |

గుణశేఖర్ కలల ప్రాజెక్టుల్లో ఒకటైన 'శాకుంతలం' చిత్రం సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. మహాభారతం ఆదిపర్వంలో ఉన్న శకుంతలా దుష్యంతుల ప్రణయగాథ ఆధారంగా రూపొందే ఈ చిత్రంలో శకుంతలగా సమంత అక్కినేని, దుష్యంతునిగా మలయాళ యువ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు.
సోమవారం సినిమా ప్రారంభ వేడుకలో స్క్రిప్టును సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిత్ర బృందానికి అందజేశారు. ఈ వేడుకలో గుణశేఖర్, దిల్ రాజు, సమంత, దేవ్ మోహన్, సంగీత దర్శకుడు మణిశర్మ, నిర్మాత నీలిమ గుణ తదితరులు పాల్గొన్నారు. గుణశేఖర్‌కు చెందిన గుణా టీమ్ వర్క్స్‌తో పాటు దిల్ రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్ 'శాకుంతలం'ను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే వారం ఈ సినిమా షూటింగ్ షురూ కానున్నది.

గుణా టీమ్ వర్క్స్ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రారంభ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. దాంతో పాటు, "#MythologyForMillennials Pan-India film, Epic Love Story #Shaakuntalam launched today." అంటూ ట్వీట్ చేసింది.

ఈ ఎపిక్ లవ్ స్టోరీ కోసం దుష్యంత పాత్రధారిగా దేవ్ మోహన్‌ను గుణశేఖర్ ఎంపిక చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటి దాకా మలయాళంలో అతను చేసింది ఒకే సినిమా. అయినప్పటికీ స్క్రీన్ టెస్ట్ చేసి, దుష్యంతునిగా అతను సరిపోతాడని భావించి ఎంపికచేశారు గుణశేఖర్. తెరపై శకుంతలా దుష్యంతులుగా సమంత, దేవ్ మోహన్ ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

![]() |
![]() |