![]() |
![]() |

రెండు రోజుల క్రితం తెలుగువన్ చెప్పిన విషయం నిజమైంది. దేశంలోని టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటించనున్నడానీ, ఆ మూవీని దిల్ రాజు నిర్మించనున్నారనీ బుధవారమే తెలుగువన్ వెల్లడించింది. ఇప్పుడు శుక్రవారం సాయంత్రం ఆ ప్రాజెక్టును దిల్ రాజు బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ఇది ఆ బ్యానర్‌కు మైలురాయి లాంటి 50వ సినిమా కావడం గమనార్హం.
ప్యాన్ ఇండియా మూవీగా ఇది రూపొందనుంది. జెంటిల్‌మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో, 2.0 లాంటి సినిమాలు తీసిన శంకర్‌కు ఇది తొలి స్ట్రయిట్ సినిమా కావడం విశేషం. తమ సంస్థకు ఇది 50వ చిత్రం కావడంతో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధినేతలు దిల్ రాజు, శిరీష్ దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ - ‘‘మేం సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలవుతుంది. ఈ జర్నీలో మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి స్టార్ హీరోలతో, అప్‌కమింగ్, డెబ్యూ హీరోలతో, దర్శకులతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయే చిత్రాలను రూపొందించాం. ఇప్పుడు మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 50వ సినిమాను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ గారితో నిర్మిస్తున్నాం. ఆయన హీరోగా నటిస్తున్న 15వ చిత్రమిది. దక్షిణాది సినిమా స్థాయిని ఇటు సబ్జెక్ట్ పరంగా, అటు సాంకేతికంగా నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిన భారీ చిత్రాల సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో, భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా లెవల్లో సినిమాను మా బ్యానర్‌లో నిర్మించనున్నాం. చరణ్, శంకర్ వంటి క్రేజీ కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా మూవీ అంటే.. సినిమాపై ఎలాంటి భారీ అంచనాలుంటాయో అర్థం చేసుకోవచ్చు. సినీ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఈ ప్యాన్ ఇండియా మూవీని రూపొందిస్తాం. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు.
![]() |
![]() |