![]() |
![]() |

మలయాళం సినిమాలో కామెడీ తాతయ్యగా కీర్తి ప్రతిష్ఠలు పొందిన దిగ్గజ నటులు ఉన్నికృష్ణన్ నూబుదిరి బుధవారం కేరళలోని తిరువనంతపురంలో కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఆయన న్యుమోనియాతో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం కన్నూర్‌లోని ఓ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. కరోనా నుంచి కోలుకుని, నెగటివ్‌గా తేలడంతో ఆదివారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే బుధవారం శ్వాస ఆడక ఇబ్బందిపడటంతో, కుటుంబసభ్యులు ఆయనను పయన్నూర్ కోపరేటివ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ సాయంత్రం 6 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. 'కల్యాణరామన్' సినిమాలో చేసిన తెక్కెడతు గోపాలకృష్ణన్ అనే పాత్ర ద్వారా మలయాళం ప్రేక్షకుల్లో ఆయన అమిత పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
ఏడు పదుల వయసులో 1996లో జయరాజ్ సినిమా 'దేశదానమ్'తో ఆయన నటునిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత రెండు దశాబ్దాల కాలంలో అనేక సినిమాల్లో నటించిన ఆయన, తన హావభావ ప్రదర్శనతో ప్రేక్షకుల్ని రంజింపజేశారు. రాజీవ్ మీనన్ మ్యూజికిల్ హిట్ 'కండుకొండేన్ కండుకొండేన్' (2000) సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టిన ఉన్నికృష్ణన్, 'పమ్మల్ కె. సంబంధమ్' (తెలుగులో 'బ్రహ్మచారి'గా డబ్ అయ్యింది) మూవీలో కమల్ హాసన్ తాతయ్యగా నటించారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా పలువురు ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలు ఉన్నికృష్ణన్ మృతికి సంతాపం తెలియజేస్తూ, ఆయనకు నివాళులర్పించారు.
![]() |
![]() |