![]() |
![]() |

నటి లువినా లోధ్ చేసిన వేధింపుల ఆరోపణలను ఖండిస్తూ డైరెక్టర్ మహేశ్ భట్ న్యాయ బృందం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ నటిపై భట్ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారని ఆ ప్రకటనలో తెలిపింది. అంతకు ముందు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో లువినా లోధ్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో భట్‌పై ఆమె కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు.
మహేశ్ భట్ లీగల్ టీమ్ విడుదల చేసిన స్టేట్‌మెంట్‌ను ఆయనకు చెందిన విశేష్ ఫిలిమ్స్ అఫిషియల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఆ స్టేట్‌మెంట్‌లో, "లువినా లోధ్ అనే ఆమె రిలీజ్ చేసిన వీడియో రిఫరెన్స్‌తో.. మా క్లయింట్ మహేశ్ భట్ తరపున ఆ ఆరోపణలను ఖండిస్తున్నాం. ఆ రకమైన ఆరోపణలు తప్పుడు, పరువునష్టం కలిగించేవి మాత్రమే కావు, చట్టపరంగా తీవ్రమైన పరిణామాలకు దారితీసేవి. మా క్లయింట్ చట్టపరంగా చర్య తీసుకోనున్నారు. Sd/- Naik Naik & Co. Legal Counsel, Vishesh Films (sic).” అని పేర్కొన్నారు.
అదివరకు ఒక నిమిషం 48 సెకన్ల నిడివి వీడియోలో మహేశ్ భట్, ఆయన ఫ్యామిలీ తనను వేధింపులకు గురిచేశారని లువినా ఆరోపించారు. వీడియోలో మొదట తన గురించి పరిచయం చేసుకున్న ఆమె, "తన ఫ్యామిలీ క్షేమం కోసమే" ఈ వీడియోను రూపొందించినట్లు తెలిపారు. మహేశ్ భట్ మేనల్లుడు సుమిత్ సభర్వాల్‌ను తను పెళ్లి చేసుకున్నట్లు కూడా ఆమె చెప్పారు.
![]() |
![]() |