![]() |
![]() |

ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న 20వ చిత్రం ఫస్ట్‌లుక్, టైటిల్ శుక్రవారం వెల్లడి కానుండటంతో ఏకైక పాన్ ఇండియా స్టార్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఇందులో రిక్షారాణి కూడా నటిస్తున్నట్లు ప్రొడక్షన్ కంపెనీ యువి క్రియేషన్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ తెలిపింది. రిక్షారాణి అంటే ఎవరో కాదు, ఎయిర్‌టెల్ 4జి బ్రాండ్ అంబాసిడర్ అయిన సాషా చెత్రి. తెలుగులో ఇదివరకే ఆమె అడివి సాయికిరణ్ రూపొందించిన 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' మూవీలో నటించింది. మూడేళ్ల క్రితం రిక్షావాలాలకు అంకితమిస్తూ 'రిక్షారాణి' అనే మ్యూజిక్ ఆల్బమ్‌ను ఆమె తీసుకు వచ్చింది. అప్పట్నుంచీ తన సోషల్ మీడియా అకౌంట్లను ఆ పేరుతోనే నిర్వహిస్తూ వస్తోంది. కాగా ప్రభాస్20 మూవీలో ఆమె ఏం క్యారెక్టర్ చేస్తుందనేది ఆసక్తికరం.
దేశంలో లాక్‌డౌన్ విధించకముందు ఈ సినిమా టీమ్ వారం రోజుల పాటు జార్జియాలో చిత్రీకరణ జరిపి, హడావిడిగా దాన్ని ముగించుకొని ఇండియాకు వచ్చేసింది. అప్పట్నుంచీ ఆ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ కానీ, లుక్ కానీ వెల్లడవుతుందేమోనని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లకు వాళ్ల ఎదురుచూపులు ఫలించి జూలై 10న ఇటు టైటిల్, అటు ఫస్ట్ లుక్ రెండూ వస్తూ.. డబుల్ ధమాకా ఇవ్వనున్నాయి. ఇప్పటికైతే 'రాధేశ్యామ్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారంలో ఉంది.
టి సిరీస్ సమర్పిస్తోన్న ఈ మూవీని కృష్ణంరాజుకు చెందిన గోపీకృష్ణా మూవీస్‌తో పాటు యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది.
![]() |
![]() |