![]() |
![]() |
ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంటే కేవలం ఊహలకు రెక్కలు తొడిగిన అద్భుత ప్రపంచాలు మాత్రమే. ఎగిరే కార్లు, రోబోల అంతరిక్ష యుద్ధాలు, అధునాతన భవిష్యత్తు నగరాలు... ఇలాంటి వింతలను వెండితెరపై చూసి ప్రేక్షకులు మురిసిపోయేవారు. కానీ కాలం చాలా వేగంగా మారింది. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం కృత్రిమ మేధస్సు (AI) యుగం.
ఈ రోజు ఏఐ మనతో మాట్లాడుతోంది, మనకోసం వ్యాసాలు రాస్తోంది, అందమైన చిత్రాలు గీస్తోంది, అద్భుతమైన సంగీతాన్ని కూడా సృష్టిస్తోంది. మనిషి రోజువారీ చేసే పనుల్లో చాలావరకు తనదైన ముద్ర వేస్తూ ప్రపంచాన్ని శాసిస్తోంది. అయితే, సాంకేతికత ఇంతలా పెరిగినా, నేటి చాట్ జీపీటీ లేదా అధునాతన ఏఐ టూల్స్ జమానాలోనూ ఇప్పటికీ సమాధానం దొరకని ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోయింది.. అదే "యంత్రాలు మనుషుల్లా నిజమైన ప్రేమను కూడా సృష్టించగలవా?".
ఈ క్లిష్టమైన ప్రశ్నను ప్రపంచం ముందుకు సరిగ్గా పాతికేళ్ల క్రితమే నిలబెట్టింది "A.I. Artificial Intelligence" అనే హాలీవుడ్ ఆంగ్ల చిత్రం. ఇది కేవలం యంత్రాలు, కోడింగ్ లేదా హార్డ్‌వేర్ గురించి తీసిన సినిమా కాదు. మనిషిలాగా నిష్కల్మషంగా ప్రేమించాలనుకున్న ఒక చిన్నారి రోబో బాలుడి కథ. రక్తమాంసాలు లేని ఇనుప శరీరంలోనూ ఒకవేళ నిజమైన మనసు ఉంటే అది ఎలాంటి వేదనను అనుభవిస్తుందో చూపించిన అరుదైన దృశ్యకావ్యం ఇది.
సరిగ్గా 2001 జూన్ 29న అమెరికాలో విడుదలైన ఈ చిత్రం, ఆ తర్వాత జూలై మొదటి వారంలో భారతదేశంలో విడుదలైంది. అంటే 2026 నాటికి ఈ అద్భుత చిత్రం విడుదలై విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సాంకేతిక హంగుల కన్నా మానవ భావోద్వేగాలకే పెద్దపీట వేసిన ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన సినీ ప్రయాణం దాగి ఉంది.
ఈ వినూత్న కథను మొదట ఊహించి, ఎన్నో ఏళ్ల పాటు తన గుండెల్లో మోసిన దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్. ఒక రోబో బాలుడు తన తల్లి నిఖార్సయిన ప్రేమ కోసం విశ్వమంతా వెతికే ఈ లైన్ ఆయనకు ఎంతో నచ్చింది. అయితే అప్పటి 1980, 1990ల నాటి సాంకేతిక పరిజ్ఞానంతో తాను అనుకున్న దృశ్యరూపాన్ని తెరపైకి తీసుకురావడం సాధ్యం కాదని భావించి, దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆయన దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
కానీ దురదృష్టవశాత్తూ ఆ కలను తెరపై ఆవిష్కరించకుండానే 1999లో ఆయన కన్నుమూశారు. ఆ తర్వాత ఆయన సన్నిహితుడు, ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. అలా కుబ్రిక్ ఆలోచనకు, స్పీల్‌బర్గ్ హృదయం తోడై ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అందుకే ఈ సినిమాను సినీ విశ్లేషకులు "కుబ్రిక్ మేధస్సు, స్పీల్‌బర్గ్ హృదయం కలిసిన అమరచిత్రం" అని కొనియాడతారు.
ఈ కథ అంతా 'డేవిడ్' అనే చిన్న రోబో బాలుడి చుట్టూ తిరుగుతుంది. చూడటానికి ఎంతో ముద్దులొలికే పిల్లాడిలా ఉంటాడు. మిగతా రోబోల్లాగే మాట్లాడుతాడు, నవ్వుతాడు, అవసరమైతే కన్నీరు పెడతాడు. కానీ అతడిని ప్రపంచంలోని మిగతా అన్ని యంత్రాల నుంచి వేరు చేసిన ఒకే ఒక్క ప్రత్యేకత.. అతడికి ప్రోగ్రామ్ చేయబడిన "ప్రేమించే గుణం". ఒక మానవ కుటుంబం ఒకానొక పరిస్థితిలో అతడిని దత్తత తీసుకుంటుంది. ఆ ఇంట్లోని తల్లిని డేవిడ్ కేవలం తన యజమానిగా కాకుండా, ప్రాణానికి ప్రాణంగా భావించే 'అమ్మ'గా స్వీకరిస్తాడు.
ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం, లాజిక్కులు, లెక్కలు ఉండవు. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారిపోవడంతో ఆ కుటుంబం డేవిడ్‌ను అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంది. అయినా డేవిడ్ ఆశ కోల్పోడు. తన అమ్మ మళ్లీ తనను ఎప్పటికైనా దగ్గరకు తీసుకుంటుందనే నమ్మకంతో, తనను నిజమైన మనిషిగా మార్చమని అడగడానికి 'బ్లూ ఫెయిరీ' (నీలి దేవత) కోసం కొన్ని వందల మైళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఆ ప్రయాణంలో అతడు పడే వేదనే ప్రేక్షకుడి గుండెను పిండేస్తుంది.
ఈ చిత్రం 25 ఏళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చినప్పుడు కృత్రిమ మేధస్సు అనేది కేవలం కొద్దిమంది శాస్త్రవేత్తల ప్రయోగశాలలకే పరిమితమై ఉండేది. కానీ నేడు అది ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చేసింది. ఏఐ ఎన్నో పనులను సులువు చేస్తోంది కానీ, డేవిడ్ లాగా ఒకరి కోసం శతాబ్దాల పాటు నిరీక్షించే నిఖార్సయిన ప్రేమను, త్యాగాన్ని మాత్రం అది ఇప్పటికీ నేర్చుకోలేకపోయింది. టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషి హృదయానికి ఉండే భావోద్వేగాల విలువను ఏ కోడింగ్ భర్తీ చేయలేదు అని చెప్పడమే ఈ సినిమా సాధించిన అతిపెద్ద విజయం. పాతికేళ్లు దాటినా ఈ సినిమా నేటికీ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలబడటానికి కారణం ఇందులోని భావోద్వేగాల బలమే.
![]() |
![]() |