![]() |
![]() |

కరోనా కాలంలో తన సేవా కార్యక్రమాలతో రియల్ హీరో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూసూద్ ఈరోజు(మంగళవారం) తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను ప్రగతిభవన్లో కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కేటీఆర్ అభినందించారు. దేశ నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోనూసూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని కేటీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, తన భవిష్యత్తు ప్రణాళికలను కేటీఆర్ తో పంచుకున్నారు. తన తల్లి స్పూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల తన అనుబంధాన్ని సోనూసూద్ పంచుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకి ప్రముఖ కంపెనీలు రావడంలో కీలక పాత్ర వహిస్తూనే, ఇతరులకంటే భిన్నంగా కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనుసూద్ పేర్కొన్నారు.

ఈ సమావేశానంతరం కేటీఆర్, సోనూసూద్ కు లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం సోనూసూద్ చేస్తున్న సేవ కార్యక్రమాలకు అభినందనగా శాలువాతో సత్కరించి.. ఒక మేమొంటో ను కేటీఆర్ అందజేశారు. కేటీఆర్ ని కలిసిన వారిలో సోనూసూద్‌తో పాటు దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |