![]() |
![]() |

'గురు' విడుదలైన తరవాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'ఆడాళ్ళూ... మీకు జోహార్లు' అని విక్టరీ వెంకటేష్ ఓ సినిమా ప్రకటించారు. అప్పటికి 'నేను శైలజ' విజయంతో దర్శకుడి పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో బలంగా వినపడుతోంది. వెంకీతో మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తాడని ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. అయితే, స్క్రిప్ట్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సినిమాను పక్కన పెట్టేశారు.
వెంకటేష్ వేరే దర్శకులతో సినిమాలు చేశారు. రామ్ హీరోగా రెండు, సాయి ధరమ్ తేజ్ హీరోగా 'చిత్రలహరి' సినిమాలు చేశారు కిషోర్ తిరుమల. కట్ చేస్తే... ఇప్పుడు 'ఆడాళ్ళూ... మీకు జోహార్లు' సినిమాను మళ్ళీ బయటకు తీశారు.
శర్వానంద్ హీరోగా 'ఆడాళ్ళూ... మీకు జోహార్లు' సినిమాను కిషోర్ తిరుమల తెరకెక్కించనున్నారు. వెంకటేష్ దగ్గర నుండి సినిమా శర్వా దగ్గరకు వచ్చింది. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారని తెలిసింది. గతంలో శర్వానంద్ హీరోగా 'పడి పడి లేచె మనసు' సినిమాను ఆయన నిర్మించారు. ప్రస్తుతం రానా హీరోగా 'విరాటపర్వం' నిర్మిస్తున్నారు.
విజయదశమికి 'ఆడాళ్ళూ మీకు జోహార్లు' సినిమా ప్రారంభించి, డిసెంబర్ లో చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం'లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తరవాత ఈ సినిమా చిత్రీకరణకు శర్వానంద్ వస్తారట.
![]() |
![]() |