![]() |
![]() |

చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి హీరోగా ఎదిగిన శర్వానంద్.. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వా.. మధ్యలో నిర్మతగానూ మారి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. తాను నటించి నిర్మించిన ఓ సినిమా కారణంగా అప్పుల పాలవ్వడమే కాకుండా.. ఆ అప్పులు తీర్చడానికి ఏకంగా ఆరేళ్ళు పట్టిందట.
శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఒకే ఒక జీవితం'. ఈ చిత్రం రేపు(సెప్టెంబర్ 9న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శర్వా.. తన కెరీర్ లో ఎదురైన పరాజయాలు, చేదు జ్ఞాపకాల గురించి పంచుకున్నాడు. 'పడి పడి లేచే మనసు' సినిమాని చాలా నమ్మి చేశానని, ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు బాధతో మూడు నెలలు బయటకు కూడా రాలేదని అన్నాడు. ఆ తర్వాత కూడా వరుస పరాజయాలు ఎదురయ్యాయని, అందుకే ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ ఓకే చేసేముందు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపాడు.
ఇక తాను నటించి నిర్మించిన 'కో అంటే కోటి' చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని శర్వానంద్ చెప్పాడు. తన తల్లి బంగారం పెట్టి మరీ ఆ సినిమా తీశానని, కానీ అది ఘోర పరాజయం పాలైందని అన్నాడు. ఆ సమయంలో చుట్టాలు, స్నేహితులతో సంబంధాలు కూడా తెగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ మూవీ కోసం చేసిన అప్పులు తీర్చడానికి ఆరేళ్ళు పట్టిందని, ఆ ఆరేళ్ళు ఒక్క చొక్కా కూడా కొనుక్కోలేదని శర్వా చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |