Home  »  News  »  పెళ్లయిన మూడు రోజులకే ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్!

Updated : Jun 25, 2026

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆనందం నిండకముందే ఒక చేదు వార్తతో అభిమానులను ఆందోళనకు గురిచేశాడు. వైష్ణవి చొడిశెట్టి అనే అమ్మాయితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించిన షణ్ణూ, పెళ్లి జరిగిన కేవలం మూడు రోజులకే ఆసుపత్రి పాలు కావడం ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

జూన్ 21న తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది. అనంతరం ఈ కొత్త జంట విశాఖపట్నంలోని తమ సొంత గృహంలో రిసెప్షన్‌ను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంకా ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతూ, బుల్లితెర సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు వ్యక్తమవుతున్న తరుణంలోనే ఈ ఊహించని సంఘటన చోటుచేసుకుంది.

తాజాగా షణ్ముఖ్ జస్వంత్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఫొటో నెటిజన్లను, ఫ్యాన్స్‌ను షాక్ కి గురిచేసింది. తాను ఆసుపత్రి బెడ్‌పై పడుకుని, చేతికి సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటున్నట్లు ఉన్న ఒక ఫొటోను షణ్ణూ పోస్ట్ చేశాడు. అయితే ఆ ఫొటోకు ఎలాంటి వివరణ ఇవ్వకుండా, అసలు తనకు ఏమైందనే విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచడంతో అభిమానులలో కంగారు మరింత ఎక్కువైంది. ఈ వార్త క్షణాల్లోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ అన్నిటా వైరల్‌గా దూసుకెళ్లింది. 

తిరుమలలో జరిగిన ప్రధాన వివాహ వేడుకతో పాటు విశాఖపట్నంలో జరిగిన రిసెప్షన్ హడావుడి వల్ల షణ్ముఖ్ శారీరకంగా విపరీతంగా అలిసిపోయాడని, ఆ అలసట కారణంగానే డీహైడ్రేషన్ లేదా తీవ్ర నీరసానికి గురై ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. పెళ్లి పనుల్లోని ఒత్తిడి, నిద్రలేమి కూడా ఇందుకు ఒక ప్రధాన కారణం కావచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

వైష్ణవిని పెళ్ళాడి షణ్ముఖ్ తన పర్సనల్ లైఫ్‌లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన తరుణంలో ఇలా ఆసుపత్రి బెడ్‌పై కనిపించడం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. ఈ విషయంపై షణ్ముఖ్ లేదా అతని కుటుంబ సభ్యులు అధికారికంగా స్పందించి పూర్తి స్పష్టత ఇస్తే తప్ప ఫ్యాన్స్ ఆందోళన తగ్గేలా లేదు. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.