![]() |
![]() |

ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు అని వింటున్నాం. కానీ అప్పట్లోనే వివిధ భాషల ప్రేక్షకులు మెచ్చేలా భారీ సినిమాలను రూపొందించారు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్. ఇప్పటి యంగ్ జనరేషన్ కి ఆయన విలువ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఆరోజుల్లో శంకర్ అంటే ఒక బ్రాండ్. 'జెంటిల్ మేన్', 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు', 'అపరిచితుడు', 'రోబో' ఇలా ఒకటేమిటి ఆయన చేసిన ప్రతి సినిమా సంచలనమే. (Shankar)
కేవలం తమిళ్ లోనే కాకుండా, మొత్తం సౌత్ ఇండియాలోనే శంకర్ సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండేది. శంకర్ సినిమా అంటే బలమైన కథాకథనాలతో పాటు భారీతనం ఉండేది. టెక్నికల్ గా ఆయన సినిమాలు ఎంతో అడ్వాన్సుడ్ గా ఉండేవి. గ్రాఫిక్స్ అంటే ఏంటో పెద్దగా ఎవరికీ తెలియని రోజుల్లోనే.. వెండితెరపై అద్భుతాలు సృష్టించారు శంకర్. అలాంటి బ్రిలియంట్ డైరెక్టర్ కొన్నేళ్లుగా వెనకబడిపోయారు. 2010లో వచ్చిన 'రోబో' తర్వాత ఇది శంకర్ సినిమా అని గర్వంగా చెప్పుకునేలా, అభిమానులు నూటికి నూరు శాతం సంతృప్తి చెందిన సినిమా రాలేదనే చెప్పాలి. 'స్నేహితుడు', 'ఐ', '2.0' సినిమాలు కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ.. అభిమానులను పూర్తిస్థాయిలో తృప్తి పరచలేదనేది వాస్తవం. ఇలా సినిమా సినిమాకి శంకర్ స్థాయి పడిపోతూ వస్తోంది. (Game Changer)
గతేడాది శంకర్ డైరెక్ట్ చేసిన 'ఇండియన్-2' విడుదలై దారుణంగా నిరాశపరిచింది. అసలు ఇది శంకర్ సినిమానేనా అని అభిమానులు తలలు పట్టుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా శంకర్ సినిమాపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో కనీసం 'గేమ్ ఛేంజర్'తోనైనా కమ్ బ్యాక్ ఇస్తాడు అనుకుంటే.. మళ్ళీ అదే తంతు. 'గేమ్ ఛేంజర్'లో భారీతనం ఉంది, నటుడిగా రామ్ చరణ్ కష్టం కనిపిస్తుంది. కానీ సినిమాకి ఏదైనా మైనస్ ఉందంటే అది డైరెక్టర్ శంకర్ మాత్రమే. ఒకప్పుడు తన సినిమాలు అంతటి వండర్స్ ఎందుకు క్రియేట్ చేశాయో.. ఒకసారి శంకర్ తనని తాను క్వశ్చన్ చేసుకోవాలి. కేవలం నిర్మాతల చేత వందల కోట్లు ఖర్చు పెట్టిస్తే సినిమాలు ఆడవని గ్రహించాలి. (Ram Charan)
అప్పటి శంకర్ సినిమాలను గమనిస్తే.. బలమైన కథాకథనాలు, కట్టిపడేసే సన్నివేశాలు, హత్తుకునే భావోద్వేగాలు, అద్భుతమైన సంగీతం.. ఇలా ప్రతిదీ ఎంతో గొప్పగా ఉండేది. వాటికి భారీతనం, టెక్నాలజీ తోడు కావడంతో.. ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేశాయి. కానీ శంకర్ మాత్రం కేవలం ఆ భారీతనం, టెక్నాలజీ మాయలో పడిపోయి.. స్క్రిప్ట్ ని గాలికి వదిలేస్తున్నారు. 'ఇండియన్-2', 'గేమ్ ఛేంజర్' సినిమాల విషయంలో జరిగింది అదే. ప్రతి ఫ్రేమ్ లో ఖర్చు కనిపిస్తుంది. కానీ సినిమాతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో శంకర్ పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు.
'ఇండియన్-2'తోనే శంకర్ పనైపోయిందనే అభిప్రాయానికి చాలా మంది వచ్చేశారు. ఇక ఇప్పుడు 'గేమ్ ఛేంజర్'తో శంకర్ 'గేమ్ ఓవర్' అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మీదట శంకర్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎవరూ సాహసించకపోవచ్చు. శంకర్ కూడా స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టకుండా.. కేవలం భారీతనం పేరుతో నిర్మాతలు చేత ఖర్చు పెట్టించడమే పనిగా పెట్టుకునేటట్లయితే.. ఇకపై ఆయన సినిమాలు చేయకపోవడమే బెటర్. అలా చేస్తే, కనీసం అప్పటి ఎవర్గ్రీన్ సినిమాల దర్శకుడిగా శంకర్ తన గౌరవన్నయినా కాపాడుకోవచ్చు. లేదంటే శంకర్ చేతులారా తన పేరుని తానే చెడగొట్టుకున్నవాడు అవుతాడు.
![]() |
![]() |