![]() |
![]() |

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. అయితే పాన్ ఇండియా సినిమా కాకుండా కేవలం రీజినల్ సినిమాతో వంద కోట్ల షేర్ రాబట్టడం అంత సులభం కాదు. ఇప్పటికీ వంద కోట్ల షేర్ మార్క్ అనేది ఎందరో స్టార్ హీరోలకు డ్రీమ్ గానే ఉంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇప్పటిదాకా ఒక్క పాన్ ఇండియా ఫిల్మ్ కూడా చేయకుండానే వరుసగా నాలుగు సార్లు రూ.100 కోట్ల షేర్ మార్క్ అందుకోవడం విశేషం.
మహేష్ గత చిత్రాలు 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' మూడూ కూడా వంద కోట్లకు పైగా షేర్ రాబట్టగా.. ఇటీవల ప్రేక్షకులను అలరించిన 'సర్కారు వారి పాట' కూడా 100 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. మే 12న విడుదలైన ఈ సినిమా ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా రూ.110 కోట్ల షేర్ రాబట్టి.. మహేష్ కెరీర్ లో అత్యధిక షేర్ రాబట్టిన సినిమాల లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. మహేష్ కెరీర్ లో రూ.139 కోట్ల షేర్ తో 'సరిలేరు నీకెవ్వరు' మొదటి స్థానంలో ఉండగా.. రూ.104 కోట్లతో మూడో స్థానంలో 'మహర్షి', రూ.101 కోట్లతో నాలుగో స్థానంలో 'భరత్ అనే నేను', రూ.87 కోట్లతో ఐదో స్థానంలో 'శ్రీమంతుడు' ఉన్నాయి.
అయితే కలెక్షన్స్ పరంగా మహేష్ కెరీర్ లో టాప్-2 లో నిలిచిన 'సర్కారు వారి పాట' బయ్యర్లకు మాత్రం నష్టాలనే మిగిల్చింది. వరల్డ్ వైడ్ గా రూ.120 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ 110.12 కోట్లతో 91 శాతం రికవరీ సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లే. దీంతో ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న బయ్యర్లు దాదాపు 10 కోట్లు నష్టపోతున్నారు. ఈ సినిమా 100 కోట్ల షేర్ మార్క్ అందుకున్నప్పటికీ హిట్ లిస్టులో చేరకపోవడానికి కారణం భారీ స్థాయిలో జరిగిన బిజినెస్ ఒక కారణమని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు.. అధిక టికెట్ రేట్లు, మూడు నాలుగు వారాలకే ఓటీటీలో అందుబాటులోకి రావడం వంటి కారణాలతో ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం తగ్గిపోవడం వంటివి కూడా ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్ కి కారణమయ్యాయి.
![]() |
![]() |