![]() |
![]() |

హీరోగా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న జగపతి బాబు.. 2014 లో విడుదలైన 'లెజెండ్' మూవీలో విలన్ గా నటించి సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి వివిధ భాషలకు చెందిన చిత్రాలలో విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నాడు. ఓ వైపు పలు భారీ చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తున్న జగపతి బాబు.. మరోవైపు ప్రధాన పాత్రధారిగానూ కొన్ని సినిమాలు చేస్తున్నాడు.
జగపతి బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం 'రుద్రంగి'. రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పై రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో అజయ్ సామ్రాట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ చూస్తుంటే ఇది పీరియడ్ ఫిల్మ్ అనిపిస్తోంది. వందలాది జనం మధ్యలో చేతిలో ఎద్దుల బండి చక్రం పట్టుకొని.. విభిన్న వస్త్రధారణ, ఆహార్యంతో ఉన్న జగపతి బాబు లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. అలాగే మోషన్ పోస్టర్ చివరిలో బ్యాక్ గ్రౌండ్ లో "రుద్రంగి నాది" అంటూ వచ్చే జగపతి బాబు డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ చిత్రంలో ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్ దాస్, కాలకేయ ప్రభాకర్ తదితరులు నటిస్తున్నారు. నాఫల్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సంతోష్, ఎడిటర్ గా నాగేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |