![]() |
![]() |

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు కృష్ణంరాజు స్వగ్రామం. 1940 జనవరి 20న ఆయన జన్మించారు. మొదటి భార్య సీతాదేవి కన్నుమూయడంతో 1996 నవంబరు 21న ఆయన శ్యామలా దేవిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. సినీ రాజకీయ రంగాలలో తనదైన ముద్రవేసిన కృష్ణంరాజు 82 ఏళ్ళ వయస్సులో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
'భక్త కన్నప్ప', 'కృష్ణ వేణి', 'కటకటాల రుద్రయ్య', 'అమర దీపం', 'మన ఊరి పాండవులు', 'బొబ్బిలి బ్రహ్మన్న', 'తాండ్ర పాపారాయుడు' వంటి సినిమాలతో కృష్ణంరాజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. దాదాపు 200 సినిమాలలో నటించి నటుడిగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన రాజకీయాల్లోనూ రాణించారు. అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పని చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణరాజు కుమారుడు. పెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్ కి ఎంతో అభిమానం. ఇద్దరూ కలిసి 'బిల్లా', 'రాధేశ్యామ్' వంటి సినిమాలలో నటించారు.
![]() |
![]() |