![]() |
![]() |

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తోందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. రాశి ఖన్నా. తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్ లో రాశి అడుగు పెట్టినట్లు సమాచారం.
2014 లో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన రాశి ఖన్నా.. తక్కువ కాలంలోనే యువతకు చేరువైంది. వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అవుతుందనే నమ్మకాన్ని కలిగించింది. అయితే టాప్ స్టార్స్ పక్కన నటించే అవకాశాలు ఆమెకు పెద్దగా రాలేదు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రమే 'జై లవ కుశ' చేసింది. ఇక కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు తక్కువగా చేస్తోంది. చివరిగా 2022 లో వచ్చిన 'పక్కా కమర్షియల్', 'థాంక్యూ' సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ సరసన 'తెలుసు కదా' చిత్రంలో నటిస్తోంది. ఇలాంటి సమయంలో ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం రావడం విశేషమనే చెప్పాలి. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో రాశి ఖన్నా మళ్ళీ తెలుగులో ఫుల్ బిజీ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |