Home  »  News  »  తీవ్ర అనారోగ్యంతో రామ్ పోతినేని లేడీ ఫ్యాన్.. రామ్ నిర్ణయంపై ప్రశంసలు 

Updated : Aug 19, 2026

 

దేవుడు ఇచ్చే వరం కంటే అభిమాని ప్రేమ వెయ్యి రేట్లు గొప్పదనే  విషయం హీరోలకి బాగా తెలుసు. అందుకే అభిమానులు అభిమాన దేవుళ్ళుగా కొనియాడబడుతుంటారు. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం, దుప్పలపూడి గ్రామానికి చెందిన సలాది శ్రీను, శ్రీదుర్గ దంపతుల 18 ఏళ్ల కుమార్తె శశి భవ్యత ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేనికి వీరాభిమాని.


  శశి భవ్యత చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చురుగ్గా ఉంటూ అందరి ప్రశంసలు అందుకునేది. కానీ, విధి ఆ చిన్నారిపై పగబట్టింది. కుటుంబంలో మూడు తరాలుగా కొనసాగుతున్న మేనరిక వివాహాల కారణంగా ఆమె అరుదైన జన్యుపరమైన సమస్యకు గురైంది. 2022 సంవత్సరం నుంచి ఆమెకు తీవ్రమైన ఫిట్స్ రావడం ప్రారంభమైంది. రోజులు గడిచేకొద్దీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడంతో ఆ యువతి మంచానికే పరిమితమైంది. స్థానిక ఆసుపత్రుల చుట్టూ తిరిగిన తర్వాత, గుంటూరులోని ఎయిమ్స్ (AIIMS) వైద్యులు ఆమెకు 'లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ' (Lafora Myoclonic Epilepsy) అనే అత్యంత అరుదైన నరాల వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు.  ఈ భయంకరమైన వ్యాధి కారణంగా భవ్యత తన శారీరక కదలికలతో పాటు మానసిక స్థిరత్వాన్ని కూడా కోల్పోయింది.

అయినప్పటికీ, ఆమెకు హీరో రామ్ పోతినేని అంటే చెప్పలేనంత అభిమానం. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, రామ్ పేరు వినగానే ఆమె ముఖంలో విపరీతమైన ఆనందం, ఉత్సాహం కనిపిస్తుంది. భవ్యతకు సరిగా ఆహారం తినిపించాలన్నా, సమయానికి మందులు వేయాలన్నా తల్లిదండ్రులు రామ్ ఫోటోలు, ఆయన సినిమాల వీడియోలు చూపిస్తూ బుజ్జగించాల్సి వస్తోంది. రామ్ పేరు చెబితేనే ఆమె ముద్ద దింపుతుందంటే, ఆ నటుడిపై ఆమెకున్న అభిమానం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.  ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని జీజీహెచ్ (GGH) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవ్యతకు ప్రతినెల మందులు, వైద్య ఖర్చుల కోసం రూ. 9,000 వరకు అవసరమవుతోంది. ఆర్థికంగా ఎంతో వెనుకబడిన ఆ కుటుంబానికి ఈ వైద్య ఖర్చులు మోయలేని భారంగా మారాయి. ప్రస్తుతం ఒక దాత సహాయంతో కాలం వెళ్లదీస్తున్న ఈ కుటుంబ దీనస్థితి, భవ్యత ఆవేదన సోషల్ మీడియా మరియు మీడియా ద్వారా వైరల్ అయి రామ్ పోతినేని దృష్టికి వెళ్లింది. 

Also Read: టాక్సిక్ వివాదంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది!


తన అభిమాని పరిస్థితిని తెలుసుకున్న రామ్ తక్షణం స్పందించారు.  ఎలాంటి ఆలస్యం లేకుండా రామ్ స్వయంగా భవ్యతతో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆప్యాయంగా పలకరిస్తూ.. "నువ్వు సరిగ్గా భోజనం చేసి, మందులు వేసుకుని త్వరగా కోలుకుంటే.. హైదరాబాద్ వచ్చి నన్ను నేరుగా కలవవచ్చు" అంటూ ఆ అమ్మాయిలో కొండంత ఆశను, జీవించే ఉత్సాహాన్ని నింపారు. అంతేకాకుండా, భవ్యత మెడికల్ రిపోర్టులను ఇప్పటికే నిపుణులైన వైద్యులకు పంపించానని, మెరుగైన చికిత్స కోసం అయ్యే పూర్తి వైద్య ఖర్చులను తానే భరిస్తానని కుటుంబానికి కొండంత భరోసా ఇచ్చారు. నిరాశలో ఉన్న ఆ కుటుంబానికి రామ్ ఇచ్చిన మాట దేవుడి వరంగా మారింది. తన రీల్ హీరో రియల్ లైఫ్‌లో చూపించిన ఈ మానవత్వానికి నెటిజన్లు, అభిమానులు నీరాజనాలు పడుతున్నారు.

Ram Pothineni, Fans, Tollywood






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.