![]() |
![]() |
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల ఊచకోత కోస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో నిర్మించిన ఈ చిత్రం వీకెండ్లో అన్ స్టాపబుల్ కలెక్షన్లను నమోదు చేసింది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల వేట మొదలుపెట్టిన 'పెద్ది'.. మూడో రోజు ముగిసేసరికి ఏకంగా రూ.236.7 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ యాప్స్‌లో కూడా దాదాపు 4 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడవడం రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు అద్దం పడుతోంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ 'రా అండ్ రస్టిక్' లుక్‌లో పల్లెటూరి యువకుడిగా ఊరమాస్ పర్ఫార్మెన్స్తో అలరించారు. 1990ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో, అణగారిన వర్గాల సామాజిక పోరాటాన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా ఆవిష్కరించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రత్నవేలు విజువల్స్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కోచ్‌గా కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మరోవైపు, ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ (అచ్చయ్యమ్మ) పాత్రను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో కొంత వివాదం చెలరేగింది. కొందరు నెటిజన్లు ఆమె క్యారెక్టరైజేషన్, గ్లామర్ డోస్ మితిమీరిందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు చాలా హుందాగా స్పందిస్తూ, ఎవరి మనోభావాలూ కించపరచడం తన ఉద్దేశం కాదని ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా, వివాదాస్పదమైన ఆయా సన్నివేశాలను సినిమా నుండి తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రకటించి వివాదానికి ఫుల్స్టాప్ పెట్టారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ 'పెద్ది' రికార్డులపై పండగ చేసుకుంటున్నారు. థియేటర్లలో చరణ్ మాస్ ఎంట్రీలు, క్రికెట్ సీన్లకు ఆడియన్స్ గూస్బంప్స్ ఫీల్ అవుతున్నారు. లాంగ్ రన్లో ఈ సినిమా మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ భారీ సక్సెస్ ఊపుతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టులపై మరింత జోష్‌తో ముందడుగు వేయనున్నారు.
![]() |
![]() |