![]() |
![]() |
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'జైలర్ 2' ఒకటి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సీక్వెల్ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఒక భారీ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ క్యామియో పాత్రలో నటిస్తుండటం, దానికి సంబంధించిన షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకోవడం ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
జైలర్ 2 చిత్రంలో తన ప్రత్యేక పాత్రకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం హృతిక్ రోషన్, చెన్నైలోని సూపర్‌స్టార్ రజనీకాంత్ నివాసానికి వెళ్లారు. అక్కడ తలైవాని మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ ఇద్దరు దిగ్గజ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. రెండు వేర్వేరు సినీ రంగాళ్లకు చెందిన ఇద్దరు బిగ్గెస్ట్ ఐకాన్లు ఇలా ఒకే చోట కనిపించడంతో సినీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "రెండు శక్తులు.. ఒకే ఫ్రేమ్‌లో!" అంటూ నెటిజన్లు ఈ ఫోటోను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.
గతంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన 'జైలర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించి, వందల కోట్ల వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఆ బ్లాక్‌బస్టర్ విజయానికి కొనసాగింపుగా వస్తున్న 'జైలర్ 2'లో ఈసారి స్టార్ కాస్టింగ్ మరింత పెరిగింది. హృతిక్ రోషన్‌తో పాటు ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్, అలాగే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి వంటి టాప్ స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతమంది హేమాహేమీలు నటిస్తుండటంతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని రాబోయే అక్టోబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ క్యామియో రోల్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, రజనీకాంత్ మరియు హృతిక్ స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త పూనకాలు తెప్పించడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ వైరల్ పిక్ మూవీపై ఉన్న హైప్‌ను వంద రెట్లు పెంచేసింది.
Rajinikanth, Hrithik Roshan, Jailer 2 Movie, Jailer 2 Cameo
![]() |
![]() |