Home  »  News  »  Prathichaya: కేరళ సీఎంపై లైంగిక ఆరోపణలు.. రంగంలోకి దిగిన కొడుకు!

Updated : Apr 19, 2026

కేరళ ముఖ్యమంత్రిపై లైంగిక ఆరోపణలు వస్తే? దాని వెనుక ఉన్న నిజానిజాలను బయటపెట్టడానికి సీఎం కొడుకు రంగంలోకి దిగితే? ఇదే పాయింట్ తో మలయాళంలో ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. అదే 'ప్రతిఛాయ' (Prathichaya).

మలయాళ హీరో, 'ప్రేమమ్' ఫేమ్ నివిన్ పౌలీ తెలుగు ప్రేక్షకులను కూడా సుపరిచితమే. గతేడాది 'సర్వం మాయ' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'బేబీ గర్ల్'తో ప్రేక్షకులను పలకరించిన నివిన్.. మార్చి 26న 'ప్రతిఛాయ' అనే సినిమాతో థియేటర్లలో అడుగుపెట్టాడు.

మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే క్రైమ్, పొలిటికల్ థ్రిల్లర్లకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అక్కడి కథల్లో ఉండే వాస్తవికత, ఉత్కంఠభరితమైన మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. 'ప్రతిఛాయ' కూడా అలాంటి ఆసక్తికరమైన కథాంశంతో వచ్చింది.

కేరళ ముఖ్యమంత్రి వర్గీస్(బాలచంద్ర మీనన్) నిజాయితీగల నాయకుడిగా పేరు తెచ్చుకుంటాడు. కొడుకు టోబిన్, తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ యువ నాయకుడిగా గుర్తింపు సంపాదిస్తాడు. మరో కొడుకు జాన్ (నివిన్ పౌలీ) మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉద్యోగం చేస్తుంటాడు. అయితే సీఎం వర్గీస్ తనని లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆరోపణలు చేస్తుంది. దీంతో సీఎం పదవికి వర్గీస్ రాజీనామా చేస్తాడు. దీని వెనకున్న నిజానిజాలు బయటపెట్టాలని జాన్ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో తెలిసిన నిజాలేంటి? ఆసక్తి లేకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జాన్‌కి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది మిగిలిన కథ.

అధికారం కోసం ఎవరైనా ఎంతటి స్థాయికైనా దిగజారుతారనే అంశాన్ని దర్శకుడు ఉన్నికృష్ణన్ సహజంగా, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆవిష్కరించాడు. అయితే ఈ తరహా కథలు ఇప్పటికే చాలా రావడంతో 'ప్రతిఛాయ' సినిమాకి థియేటర్లలో పెద్దగా ఆదరణ లభించలేదు. అందుకే నాలుగు వారాలకే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

'ప్రతిఛాయ' ఓటీటీ రైట్స్ ను జియో హాట్‌స్టార్ (Jio Hotstar) కైవసం చేసుకుంది. ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగులో కూడా అందుబాటులో వచ్చే అవకాశముంది. పొలిటికల్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఉంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.