Home  »  News  »  Prakash Raj: ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలు దేనికి?.. ఏపీ ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ ఫైర్!

Updated : Jul 3, 2026

ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబర్ బచలకురి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలపై, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జూన్ 30న హైదరాబాద్‌లో పిఠాపురం పోలీసులు రావణ్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పిఠాపురం కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ, సర్పవరం పోలీసులు 2025 నాటి పాత కేసును తెరపైకి తెచ్చి వెంటనే రెండోసారి అరెస్ట్ చేశారు. ఆ కేసులోనూ కోర్టు రిమాండ్ తిరస్కరించి పర్సనల్ బాండ్‌పై జూలై 2న బెయిల్ ఇచ్చినప్పటికీ, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇనగుదురు పోలీసులు మూడో కేసులో అతడిని మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఇలా వరుసగా 3 సార్లు అరెస్ట్ కావడం, కోర్టులు బెయిల్ ఇస్తున్నా విడిచిపెట్టకుండా వేరే ప్రాంతాల పోలీసులు స్టేషన్ల చుట్టూ తిప్పడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. జనసేన శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ మొత్తం వ్యవహారంపై జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. "ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలు దేనికి?" అని ప్రకాశ్ రాజ్ నిలదీశారు. న్యాయస్థానాలు ఒక కేసులో తప్పులేదని భావించి బెయిల్ ఇస్తుంటే, వెంటనే మరో పాత కేసునో, కొత్త కేసునో పెట్టి జైలుకు పంపడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. ప్రశ్న రావణ్‌ను కస్టడీలో ఉంచేందుకు ఏకంగా 30 కేసులు సిద్ధం చేశారని వింటున్నానని, మరి ఇంతలా కక్ష సాధిస్తూ అధికార బలాన్ని ఎక్కడివరకు తీసుకెళ్తారని ఆయన ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో విమర్శించే గొంతులను ఈ విధంగా అణచివేయడం సరికాదని, పాలకులు చేస్తున్న ఈ తప్పులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని ప్రకాశ్ రాజ్ హెచ్చరించారు. కేవలం సోషల్ మీడియాలో మాట్లాడినందుకు ఒక వ్యక్తిని ఈ విధంగా వేధించడం శోచనీయమని, ఇప్పటికైనా ఈ రాజకీయ వేధింపులు ఆపి, ప్రశ్న రావణ్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ అరెస్టుల వెనుక ఉన్న రాజకీయ ప్రతీకారంపై నెటిజన్ల నుంచి కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

 


Prakash Raj, Prashna Raavan Arrest, AP Police, Youtuber Joseph Ravan, Pawan Kalyan, Chandrababu Naidu






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.