Home  »  News  »  Nawab Cafe: అప్పుడే ఓటీటీలోకి 'నవాబ్ కేఫ్'.. ఈ 'చాయ్ వాలా' కథ ఏంటి?

Updated : Mar 8, 2026

జయాపజయాలతో సంబంధం లేకుండా మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన మూడు నాలుగు వారాలకే ఓటీటీలో అడుగుపెడుతున్నాయి. ఇటీవల ప్రేక్షకులను పలకరించిన 'నవాబ్ కేఫ్' సినిమా కూడా మూడు వారాలు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. (Nawab Cafe)

శివ కందుకూరి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'నవాబ్ కేఫ్'. ప్రమోద్ హర్ష దర్శకత్వంలో హర్షిక ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో అడుగుపెట్టింది. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఒక 'చాయ్ వాలా' కథగా ఇది తెరకెక్కింది.

ఇష్టంగా, నిజాయితీగా చేస్తే ఏ పనిలోనైనా విజయం సాధిస్తామనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. వారసత్వంగా వస్తున్న నవాబ్ కేఫ్ ని తండ్రి నడిపిస్తుంటాడు. కొడుక్కి మాత్రం ఆ చాయ్ వాలా బ్రతుకు నచ్చదు. డబ్బు సంపాదించాలి, రిచ్ లైఫ్ బతకాలి అనుకుంటాడు. అయితే ఒకానొక సమయంలో తండ్రి విలువ తెలుసుకొని, తండ్రి బాటలోనే పయనించి జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటాడు. 

కథాంశం, తండ్రీకొడుకుల మధ్య సన్నివేశాలు బాగున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో సినిమా మెప్పించలేకపోయింది. అందుకే బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది. మార్చి 12 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.

కొన్ని సినిమాలు థియేటర్లలో రిజల్ట్ ఎలా ఉన్నా ఓటీటీలో సర్ ప్రైజ్ చేస్తాయి. 'నవాబ్ కేఫ్' కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకునే అవకాశముంది. నవాబ్ కేఫ్ సెటప్, తండ్రీకొడుకుల భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే.. ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుంది అనడంలో సందేహం లేదు.

కథ ఏంటంటే..
రాజా(శివ కందుకూరి) హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువకుడు. అప్పట్లో రాజా తాత చాయ్ కి ఫుల్ క్రేజ్. అతని చాయ్ కి ఫిదా అయిన నవాబ్.. విలువైన భూములను రాసిస్తాడు. వాటాలో భాగంగా ఆ భూములను పెద్ద కొడుకు తీసుకోగా, చిన్న కొడుకైన రాజా తండ్రి రంగనాథ్(రాజీవ్ కనకాల) మాత్రం వారసత్వంగా నవాబ్ కేఫ్ ని తీసుకుంటాడు. రంగనాథ్ చాయ్ కి, నవాబ్ కేఫ్ కి ఎందరో ఫ్యాన్స్ ఉంటారు.

రాజాకి మాత్రం ఈ 'చాయ్ వాలా' లైఫ్ నచ్చదు. కోట్లకు కోట్లు సంపాదించాలని కలలు కంటుంటాడు. పెదనాన్న కొడుకు కుమార్(చైతన్య కృష్ణ) సూచనతో 'నవాబ్ కేఫ్' ఉన్న స్థలాన్ని అమ్మేసి, రిచ్ లైఫ్ బతకాలని రాజా నిర్ణయించుకుంటాడు. ఆ నిర్ణయంతో రాజా జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ప్రాణంగా భావించే నవాబ్ కేఫ్ ని అమ్మడానికి రంగనాథ్ ఒప్పుకున్నాడా? నవాబ్ కేఫ్ చరిత్రలో కలిసిపోయిందా లేక చరిత్ర సృష్టించిందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Also Read: నవాబ్ కేఫ్ మూవీ రివ్యూ

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.