![]() |
![]() |

తారాగణం: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు
సంగీతం: పవన్
డీఓపీ: శ్రీనివాస్ బెజుగం
ఎడిటర్: నాగేశ్వర్ రెడ్డి
దర్శకత్వం: శివ పాలడుగు
నిర్మాతలు: హర్ష గారపాటి, రంగారావు గారపాటి
బ్యానర్: ఫ్లై హై సినిమాస్
విడుదల తేదీ: జూన్ 14, 2024
నటుడిగా పలు చిత్రాలలో నటించి మెప్పించిన అజయ్ ఘోష్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'మ్యూజిక్ షాప్ మూర్తి'. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే...
కథ:
52 ఏళ్ళ మూర్తి(అజయ్ ఘోష్) వినుకొండలో మ్యూజిక్ షాప్ నడుపుతుంటాడు. ఆదాయం రాకపోవడంతో.. మ్యూజిక్ షాప్ తీసేసి, మొబైల్ షాప్ పెట్టుకోమని భార్య జయ(ఆమని) కోరుతుంది. కానీ మ్యూజిక్ మీద ఉన్న ప్రేమతో మూర్తి ఆ షాప్ ని అలాగే రన్ చేస్తుంటాడు. ఈ ఇంటర్నెట్ యుగంలో క్యాసెట్లు కొనేవారు లేకపోవడంతో.. ఫంక్షన్స్, పార్టీలకు మైక్ సెట్ అరేంజ్ చేసి పాటలు ప్లే చేసే పని చేస్తుంటాడు. ఈ క్రమంలో డీజేగా మారితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఒకరు సలహా ఇస్తారు. దీంతో డీజేగా మారాలని నిర్ణయించుకుంటాడు మూర్తి. అదే సమయంలో అంజన(చాందిని చౌదరి) అనే యువతి పరిచయమవుతుంది. ఆమెకి కూడా డీజే కావాలనే కోరిక ఉంటుంది. మూర్తి పట్టుదల చూసిన అంజన.. అతనికి డీజే నేర్పుతుంది. ఈ క్రమంలో ఇద్దరికీ అవమానాలు ఎదురవుతాయి. దానికి తోడు సడెన్ గా అంజన కనిపించకుండా పోవడంతో.. మూర్తి మీద కిడ్నాప్ కేసు నమోదవుతుంది. ఆ తరువాత మూర్తి ప్రయాణం ఎలా సాగింది? తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? అంజన ఎక్కడికి వెళ్ళింది? ఆమె లక్ష్యం నెరవేరిందా? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
జీవితంలో ఏదైనా సాధించాలంటే.. వయసు అడ్డు కాదు అని నిజ జీవితంలో ఎందరో రుజువు చేశారు. 'మ్యూజిక్ షాప్ మూర్తి' కూడా అదే పాయింట్ తో రూపొందింది. 50 ఏళ్లు పైబడిన వ్యక్తి.. అవమానాలు, అవరోధాలను అధిగమించి డీజే ఎలా అయ్యాడు అనేది ఈ చిత్ర కథ. కథగా చూసుకుంటే చాలా చిన్న కథ. కథనంలో కూడా ఊహించని మలుపులు ఉండవు. అయినప్పటికీ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా సినిమాని మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా నడిస్తే.. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా నడిచింది. అటు కామెడీని, ఇటు ఎమోషన్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ.. ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. క్లైమాక్స్ మాత్రం సాగదీతగా అనిపించింది. ఆ విషయంలో కేర్ తీసుకొని ఉండాల్సింది.
ఇటువంటి కథను తీసుకొని.. ప్రేక్షకులను రెండు గంటల పాటు కూర్చునేలా చేసి.. వారి మెప్పు పొందాలంటే దర్శకుడిగా అనుభవం ఉండాలి. శివ పాలడుగు నూతన దర్శకుడు అయినప్పటికీ తన ప్రతిభను చాటుకున్నాడు.
టెక్నికల్ గా చూస్తే.. సినిమాటోగ్రఫి ఆకట్టుకుంది. సంగీతం పరవాలేదు. ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
టైటిల్ రోల్ పోషించిన అజయ్ ఘోష్.. మూర్తి పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సినిమాకి కీలకమైన అంజన పాత్రలో చాందిని మెప్పించింది. మూర్తి భార్య పాత్రలో ఆమని కట్టిపడేసారు. అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా..
కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్ళతో రూపొందిన ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి హాయిగా చూడొచ్చు.
![]() |
![]() |