![]() |
![]() |

గతేడాది 'హనుమాన్'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తేజ సజ్జా.. ఈ ఏడాది 'మిరాయ్' అనే మరో సూపర్ హీరో ఫిల్మ్ తో అలరించనున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ లో మంచు మనోజ్ నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు. సెప్టెంబర్ 12న థియేటర్లలో అడుగుపెట్టనున్న 'మిరాయ్'పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
ఇప్పటికే విడుదలైన 'మిరాయ్' గ్లింప్స్, టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. వాటిలో అశోకుని ఆశయం, తొమ్మిది గ్రంథాలు, దైవ రహస్యం అంటూ సినిమాపై ఆసక్తి కలిగేలా చేశారు మేకర్స్. ముఖ్యంగా టీజర్ ను అశోకుడితో ప్రారంభించి, శ్రీరాముడితో ముగించిన తీరు కట్టిపడేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా అంతకుమించి అనేలా ఉంది.
మూడు నిమిషాల నిడివితో రూపొందించిన 'మిరాయ్' ట్రైలర్ విజువల్ వండర్ లా ఉంది. మనోజ్ లోకాన్ని నాశనం చేయగల పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తున్నాడు. తొమ్మిది గ్రంథాలు మనోజ్ చేతికి చేరకుండా పోరాడి, ప్రజలను కాపాడే యోధుడి పాత్రలో తేజ కనిపిస్తున్నాడు. శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఆయుధం తేజ చేతికి రావడం, దాంతో అతను పోరాడటం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. త్రేతా యుగాన్ని, అశోక చక్రవర్తి కాలాన్ని, వర్తమానాన్ని ముడిపెడుతూ కథని మలిచిన తీరు అద్భుతంగా ఉంది. ఇక ట్రైలర్ చివరిలో రాముడి విజువల్స్ హైలైట్ గా నిలిచాయి. ట్రైలర్ లో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, వీఎఫ్ఎక్స్, డైలాగ్స్ ఇలా ప్రతి విభాగం పనితీరు ఆకట్టుకునేలా ఉంది.
'హనుమాన్'లో హనుమంతుడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించాయి. 'మిరాయ్'లో శ్రీరాముడి నేపథ్యంలో వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని అర్థమవుతోంది. అంతేకాదు, 'మిరాయ్'లో తేజ పాత్ర కూడా హనుమంతుడిని గుర్తు చేసేలా ఉండటం విశేషం. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే.. తేజ సజ్జా ఖాతాలో మరో పాన్ ఇండియా సక్సెస్ వచ్చి చేరేలా ఉంది. 'హనుమాన్'తో రూ.300 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన ఈ యంగ్ హీరో.. 'మిరాయ్'తో రూ.500 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యంలేదు.
![]() |
![]() |