Home  »  News  »  మయసభ వెబ్ సిరీస్ రివ్యూ

Updated : Aug 7, 2025

 

తారాగణం: ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, దివ్య దత్తా,  రవీంద్ర విజయ్, శత్రు తదితరులు
దర్శకత్వం: దేవ కట్టా, కిరణ్ జై కుమార్
నిర్మాతలు: విజయ్ కృష్ణ, శ్రీ హర్ష
ఓటీటీ: సోనీ లివ్
విడుదల తేదీ: ఆగస్టు 7, 2025

 

వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు పొందారు దేవ కట్టా. ఆయన క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ 'మయసభ'. ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకుల స్నేహం నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్ కావడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో 'మయసభ'పై ప్రేక్షకుల దృష్టి పడింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Mayasabha review)

 

కథ:
చిత్తూరు జిల్లాలోని ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కృష్ణమనాయుడు(ఆది పినిశెట్టి). ఉన్నత చదువులు చదవాలి, ప్రజా సేవ చేయాలనే గొప్ప ఆలోచనలతో ఉంటాడు. వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళం, మనకెందుకు ఇవన్నీ అని కుటుంబ సభ్యులతో సహా అందరూ నిరుత్సాహ పరుస్తున్నా వినడు. మరోవైపు కడప జిల్లాలోని ఉన్నత కుటుంబానికి చెందిన రామిరెడ్డి(చైతన్య రావు) వైద్య విద్యను అభ్యసిస్తుంటాడు. అతని తండ్రిపై రౌడీ/ఫ్యాక్షనిస్ట్ అనే ముద్ర ఉంటుంది. రౌడీయిజం, రాజకీయానికి దూరంగా ఉండే రామిరెడ్డి.. ప్రజల్లో ఒకడిగా ఉంటూ, వైద్యుడిగా ప్రజలకు సేవ చేయాలి అనుకుంటాడు. ఇలా వేరు వేరు ప్రాంతాలలో గొప్ప ఆలోచనలతో ఉన్న కృష్ణమనాయుడు, రామిరెడ్డి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? ఆ పరిచయం స్నేహంగా ఎలా మారింది? వీరి రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది? రాజకీయాల్లోకి అడుగు పెట్టాక ఇద్దరు మిత్రులు ప్రత్యర్థులుగా ఎలా మారారు? వంటి విషయాలు సిరీస్ చూసి తెలుసుకోవాలి.

 

విశ్లేషణ:
'మయసభ' కల్పిత కథ అని మేకర్స్ చెప్పినప్పటికీ.. ఇది చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి మధ్య స్నేహాన్ని, వారి రాజకీయ ప్రయాణాన్ని ఆధారంగా తీసుకొని రాసుకున్న కథ అని.. సిరీస్ చూసే ప్రతి ఒక్కరికీ అర్థమవుతూనే ఉంటుంది. అదే సమయంలో వారి పాత్రలను కల్పిత పాత్రలుగా మార్చడమే కాకుండా, వారి మధ్య కొన్ని కల్పిత సన్నివేశాలను కూడా అల్లారని అనిపిస్తుంది.

సినిమా అయినా, సిరీస్ అయినా పొలిటికల్ డ్రామాను డీల్ చేయడం అంత తేలిక కాదు. ఎత్తులు పైఎత్తులతో ఉండే రాజకీయ చదరంగాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చూపించడానికి ఎంతో వర్క్ చేయాలి. ఆ పరంగా దేవ కట్టా దిట్ట అని తన రెండో సినిమా 'ప్రస్థానం'తోనే రుజువైంది. ఇప్పుడు 'మయసభ' విషయంలోనూ ఆయన ప్రతిభ అడుగడుగునా కనిపించింది.

'మయసభ' సిరీస్ ను తొమ్మిది ఎపిసోడ్లుగా విడుదల చేశారు. మొదటి ఎపిసోడ్ లో కృష్ణమనాయుడు, రామిరెడ్డి పాత్రల తీరుని, వారి కుటుంబ నేపథ్యాలను చూపించారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన కృష్ణమనాయుడు పెద్ద పెద్ద ఆలోచనలతో ఉంటాడు. ఇక రామిరెడ్డి తన తండ్రిపై పడిన ఫ్యాక్షనిస్ట్ అనే ముద్రకు దూరంగా, ప్రజా వైద్యుడిగా స్థిరపడాలనే ఆలోచనతో ఉంటాడు. ఇద్దరి జీవితాలను సమాంతరంగా చూపిస్తూ.. ఇద్దరు ఎప్పుడు కలుస్తారనే ఆసక్తిని మొదటి ఎపిసోడ్ లోనే కలిగించడంలో 'మయసభ' టీం సక్సెస్ అయింది.

రెండో ఎపిసోడ్ లో ఇద్దరి కాలేజ్ జీవితాలు చూపించారు. కృష్ణమనాయుడు స్టూడెంట్ లీడర్ గా ఎదిగే ప్రయత్నాల్లో ఉంటే, రామిరెడ్డి మాత్రం తెలుగువారి ఆరాధ్య నటుడు RCR అభిమానిగా కర్ణాటకలో తెలుగోడి సత్తా చూపిస్తాడు. మూడో ఎపిసోడ్ లో ఇద్దరి ప్రేమకథలు చూపించారు. రామిరెడ్డి తన బంధువుల అమ్మాయిని ప్రేమించి పెళ్లాడతాడు. అయితే కృష్ణమనాయుడు విఫల ప్రేమ కథ మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఒకమ్మాయిని ప్రేమించాడని, ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ అయింది అన్నట్టుగా చూపించారు. తండ్రి ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉండాలని రామిరెడ్డి నిర్ణయించుకోవడం, కృష్ణమనాయుడు ప్రేమ విఫమవ్వడం.. అలా ఇద్దరు అనుకోకుండా బస్సులో పరిచయం అవ్వడంతో మూడో ఎపిసోడ్ ముగుస్తుంది. అంటే ఈ ఇద్దరి మధ్య పరిచయం కోసం మూడు ఎపిసోడ్ల సమయం తీసుకున్నారు.

నాలుగో ఎపిసోడ్ లో ఎమర్జెన్సీ పరిస్థితులు.. ఈ క్రమంలో కృష్ణమనాయుడు, రామిరెడ్డి మధ్య గొడవ జరగడం, ఆ తర్వాత ఇద్దరు మంచి స్నేహితులుగా మారడం వంటి సన్నివేశాలు చూపించారు. అయితే ఈ ఎపిసోడ్ కాస్త నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడైతే ఇద్దరి రాజకీయ ప్రయాణం మొదలైందో.. అప్పటి నుంచి సిరీస్ ఆసక్తికరంగా మారుతుంది. ఎమ్మెల్యే టికెట్లు సాధించడం, ఎమ్మెల్యేలుగా గెలుపొందడం, మంత్రి పదవులు పొందటం.. ఇలా ఇద్దరు మిత్రులు రాజకీయ నాయకులుగా ఎదిగే క్రమం మెప్పిస్తుంది. అయితే చివరి రెండు ఎపిసోడ్ లు మళ్ళీ కాస్త నెమ్మదిగా సాగాయి. ఈ ఎపిసోడ్లకు నిడివి ప్రధాన సమస్యగా మారింది. వీటిలో ఎక్కువగా RCR రాజకీయం ప్రవేశం, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులను చూపించారు. RCR కి కృష్ణమనాయుడు అల్లుడు అవ్వడం, ఆ తర్వాత ఆయనకే ఎదురుతిరగడం, మరోవైపు ప్రతిపక్ష నేతగా రామిరెడ్డి ఎదగటం వంటి సన్నివేశాలు ఉంటాయి. సీఎంగా నాయుడు, ప్రతిపక్ష నేతగా రెడ్డి ఎదిగాక.. వీరి రాజకీయ పోరు ఎలా సాగింది అనేది మాత్రం నెక్స్ట్ సీజన్ లో చూడాలి.

'మయసభ'లో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. ఇద్దరి మిత్రుల ప్రయాణం అని చెప్పినప్పటికీ.. ఆ సమయంలో రాజకీయ పరిస్థితులను అన్నింటినీ చూపించే ప్రయత్నం చేశారు. విజయవాడ గొడవలు, అనంతపురం కొట్లాటలు, ఎమర్జెన్సీ ఇలా ఎన్నో ప్రస్తావించారు. వీటి వల్ల నిడివి పెరిగింది తప్ప.. సిరీస్ కి అదనపు బలం చేకూరలేదు. పైగా వంగవీటి, రక్తచరిత్ర, ఎమర్జెన్సీ సినిమాలు చూసిన వారికి.. మళ్ళీ అవే సన్నివేశాలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. 

ఓవరాల్ గా అయితే 'మయసభ' సిరీస్ బాగుంది. కృష్ణమనాయుడు, రామిరెడ్డి పాత్రలను ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు కాకుండా.. రెండు పాత్రలను సమానంగా మలిచిన తీరు బాగుంది. అయితే నిజ జీవిత పాత్రలకు అన్వయించి చూసుకుంటే మాత్రం.. కొంత వివాదం కూడా అయ్యే అవకాశముంది. రెడ్డి తండ్రిని రౌడీ, ఫ్యాక్షనిస్ట్ అన్నట్టుగా చూపించడమే కాకుండా.. ఇతర రెడ్డి కుటుంబాలు వారిని దూరంగా పెట్టేవి అన్నట్టుగా చూపించారు. ఇక కృష్ణమనాయుడుకి నత్తి ఉంది అన్నట్టుగా, దాని నుంచి బయటపడటానికి డాక్టర్ గా రెడ్డి హెల్ప్ చేసినట్లు చూపించారు. అలాగే కృష్ణమనాయుడు లవ్ స్టోరీ కూడా హాట్ టాపిక్ అయ్యే ఛాన్స్ ఉంది.

 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
కృష్ణమనాయుడు పాత్రలో ఆది పినిశెట్టి, రామిరెడ్డి పాత్రలో చైతన్య రావు ఒదిగిపోయిన తీరు అమోఘం. ఇద్దరూ పోటాపోటీగా నటించి సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచారు. RCR పాత్రలో సాయి కుమార్ సర్ ప్రైజ్ చేశారు. బాబురావు అనే సీనియర్ నాయకుడి పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ ఆకట్టుకున్నారు. అక్కడక్కడా వినోదాన్ని కూడా పంచారు. వీరు మాత్రమే కాదు.. అన్ని పాత్రలకు సంబంధించి నటీనటుల ఎంపిక చక్కగా కుదిరించింది. ఆయా పాత్రలకు అందరూ న్యాయం చేశారు. రామిరెడ్డి తండ్రి శివారెడ్డి పాత్రధారుడిని కూడా ప్రత్యేకంగా అభినందించాలి.

'మయసభ' సిరీస్ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా ఆర్ట్, సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచాయి. అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించారు. సంగీతం పరవాలేదు. పాటలు తేలిపోయాయి కానీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. ముఖ్యంగా చివరి ఎపిసోడ్ల నిడివిని కుదించే ప్రయత్నం చేయాల్సింది. సంభాషణలు బాగున్నాయి. నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్స్:
కథా నేపథ్యం
దర్శకత్వం
నాయుడు, రెడ్డి పాత్రలను మలిచిన తీరు
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:
కొన్ని ఎపిసోడ్ల నిడివి
ఎమర్జెన్సీ వంటి ఇతర అంశాల ప్రస్తావన 
సినిమాటిక్ లిబర్టీ

 

ఫైనల్ గా..
పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే వారికి 'మయసభ' సిరీస్ నచ్చుతుంది. కృష్ణమనాయుడు, రామిరెడ్డి పాత్రలను మలిచిన తీరు బాగుంది. వారి రాజకీయ ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. అక్కడక్కడా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ.. తెలుగులో వచ్చిన బెస్ట్ పొలిటికల్ సిరీస్ లలో ఒకటిగా ఇది నిలిచే అవకాశముంది.

 

రేటింగ్: 3/5 

- గంగసాని 

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. We would encourage viewers' discretion before reacting to them.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.