Home  »  News  »  Maa Ka Sum Review: ‘మా కా సమ్’ వెబ్ సిరీస్ రివ్యూ.. డేటింగ్ యాప్‌లో తల్లికి పార్ట్‌నర్‌ను వెతికే కొడుకు కథ!

Updated : Apr 9, 2026

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకులను పలకరించిన సరికొత్త వెబ్ సిరీస్ ‘మా కా సమ్’ (Maa Ka Sum). సీనియర్ నటి మోనా సింగ్, యువ నటుడు మిహిర్ అహూజా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్, ఒక సున్నితమైన అంశాన్ని ఆధునిక కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. నికోలస్ ఖార్కోమ్ గోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ ఎలా ఉందంటే..?

కథ:
వినీత (మోనా సింగ్) తన కొడుకు అగస్త్య (మిహిర్ అహూజా)తో కలిసి ఢిల్లీలో నివసిస్తూ ఉంటుంది. అగస్త్య చిన్నతనంలోనే.. వినీత భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. దాంతో అన్నీ తానై కొడుకుని పెంచుకుంది. అగస్త్య కాలేజ్ లో చదువుతుంటాడు. అతను మ్యాథ్స్ లో జీనియస్. తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లికి ఒక తోడు ఉండాలని భావిస్తాడు. ఈ క్రమంలో ఆమె కోసం డేటింగ్ వెబ్‌సైట్ల ద్వారా సరైన వ్యక్తిని వెతికే బాధ్యతను తానే తీసుకుంటాడు. ఈ లెక్కల జీనియస్ తన తల్లి కోసం ఎలాంటి లెక్కలు వేశాడు. ఈ ప్రయాణంలో తల్లి కొడుకుల మధ్య వచ్చే మార్పులు, అగస్త్య వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలే ఈ సిరీస్ కథ.

విశ్లేషణ:
సాధారణంగా భారతీయ సమాజంలో తల్లిని కేవలం త్యాగమూర్తిగా మాత్రమే చూస్తారు. కానీ ఆమెకు కూడా వ్యక్తిగత ఇష్టాలు, ఆకాంక్షలు ఉంటాయనే పాయింట్‌ను ఈ సిరీస్ ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నాడు. గతంలో తండ్రికి పెళ్లి చేసే కొడుకు కథలు లేదా తల్లికి తోడు వెతికే కూతురు కథలు వచ్చినప్పటికీ, ఇందులో ‘డేటింగ్’ కాన్సెప్ట్‌ను జోడించి కొంచెం కొత్తగా ప్రజెంట్ చేశారు. అయితే, ఈ ఆధునిక ఆలోచనా ధోరణి ఎంతవరకు సామాన్య ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనేది ప్రశ్నార్థకమే.

ఈ కథలో చూపించిన 'తల్లి డేటింగ్‌కు వెళ్లడం' అనే కాన్సెప్ట్ సాధారణ ప్రేక్షకులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి అంత త్వరగా కనెక్ట్ కాకపోవచ్చు. ఇది కేవలం అర్బన్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తీసినట్టుగా కనిపిస్తుంది.

అయితే తల్లీకొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని మాత్రం చాలా సహజంగా, ఎక్కడా అతి లేకుండా చూపించారు. వారిద్దరి మధ్య వచ్చే సంభాషణలు హృదయానికి హత్తుకుంటాయి. కథలో అక్కడక్కడా వచ్చే కామెడీ బోర్ కొట్టించకుండా చూస్తుంది. ముఖ్యంగా డేటింగ్ ప్రక్రియలో ఎదురయ్యే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి.

ఎనిమిది ఎపిసోడ్ల పాటు సాగే ఈ సిరీస్ కొన్ని చోట్ల చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు అనవసరంగా సాగదీసినట్లు అనిపిస్తుంది. సిరీస్ ముగింపు కూడా ఇంకా బలంగా ఉండాల్సింది. అలాగే హీరో కాలేజీ లైఫ్, లెక్చరర్‌తో అతని ట్రాక్.. కథకు అంతగా బలాన్ని చేకూర్చలేదు. అది మెయిన్ స్టోరీ ప్రయాణాన్ని పక్కదారి పట్టించినట్టు అనిపిస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: 
మోనా సింగ్ మరోసారి తన అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఒక బాధ్యతాయుతమైన తల్లిగా, మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే మహిళగా ఆమె నటన సహజంగా ఉంది. ఇక కొడుకు పాత్రలో మిహిర్ అహూజా ఒదిగిపోయాడు. మ్యాథ్స్ ని ప్రేమిస్తూనే, తల్లి ఆనందం కోసం తపించే యువకుడిగా తన నటనతో మెప్పించాడు. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచింది.

సాంకేతిక పరంగా 'మా కా సమ్' ఒక క్వాలిటీ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. కథనం నెమ్మదిగా ఉన్నా.. విజువల్స్, మ్యూజిక్ ఆ లోటును కొంతవరకు భర్తీ చేశాయి. విజువల్స్ చాలా ప్లెజెంట్‌గా ఉన్నాయి. ఢిల్లీ నగరంలోని మధ్యతరగతి వాతావరణాన్ని, అక్కడి గల్లీలను, ఇళ్లను చాలా సహజంగా కెమెరాలో బంధించారు. నేపథ్య సంగీతం కథలోని ఎమోషన్స్‌ను పండించడంలో సాయపడింది. ముఖ్యంగా తల్లి, కొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్‌లో మ్యూజిక్ ప్రేక్షకుడిని కథలోకి లీనమయ్యేలా చేస్తుంది.

ఎడిటింగ్ విభాగం పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. నిడివి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కొన్ని అనవసరమైన ల్యాగ్ సీన్స్‌ను కత్తిరించి ఉంటే కథనం మరింత వేగంగా సాగేది. ముఖ్యంగా మధ్యలో వచ్చే కొన్ని ఉపకథలను (Sub-plots) మరింత షార్ప్‌గా ఎడిట్ చేసి ఉంటే ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టే అవకాశం ఉండేది కాదు.

దర్శకుడు నికోలస్ ఖార్కోమ్ గోర్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. దాన్ని ఆవిష్కరించిన తీరు కూడా బాగానే ఉంది. నటీనటుల నుంచి బెస్ట్ అవుట్‌పుట్ రాబట్టుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సిరీస్ స్థాయికి తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి. 

ప్లస్ పాయింట్స్:
నటీనటుల పర్ఫార్మెన్స్
కొత్తదనంతో కూడిన పాయింట్
ఎమోషన్స్
కామెడీ

మైనస్ పాయింట్స్:
నెమ్మదించిన కథనం
క్లైమాక్స్
సబ్ ప్లాట్స్

ఫైనల్ గా..
‘మా కా సమ్’ వెబ్ సిరీస్ అనేది ఒక బోల్డ్ అటెంప్ట్‌. ఒక కొత్త తరహా కథాంశాన్ని చూడాలనుకునే వారు, ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే వారు ఈ సిరీస్‌ను ఒక లుక్కేయొచ్చు. ముఖ్యంగా మోనా సింగ్ పెర్ఫార్మెన్స్ కోసం చూడవచ్చు. అయితే 'తల్లి డేటింగ్‌కు వెళ్లడం' అనే కాన్సెప్ట్ కొందరికి నచ్చకపోవచ్చు.

రేటింగ్: 2.25/5

Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.