![]() |
![]() |

సినిమా పేరు: లవ్ మౌళి
తారాగణం: నవదీప్, పంఖురి గిద్వానీ, రానా దగ్గుబాటి(అతిథి పాత్రలో), భావన సాగి, మిర్చి హేమంత్, కిరణ్, చార్వి దత్త తదితరులు
సంగీతం: గోవింద్ వసంత
డీఓపీ: అజయ్ శివశంకర్
దర్శకత్వం: అవనీంద్ర
బ్యానర్స్: సి స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్
విడుదల తేదీ: జూన్ 7, 2024
కొన్నేళ్ల విరామం తరువాత నవదీప్ హీరోగా నటించిన చిత్రం 'లవ్ మౌళి'. నవదీప్ 2.0 గా తనని తానూ కొత్తగా లాంచ్ చేసుకుంటున్నట్లు ప్రమోషన్స్ లో చెప్పారు. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? నవదీప్ కి మంచి విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో మౌళి(నవదీప్) తన తాతయ్య దగ్గర పెరుగుతాడు. తనకి 14 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు తాతయ్య కూడా చనిపోవడంతో.. తనకి ఎవరితో సంబంధం లేదన్నట్టుగా, ప్రపంచాన్ని పట్టించుకోకుండా, తనకి నచ్చినట్టుగా పెరుగుతాడు. మౌళి ఒక మంచి పెయింటర్. మేఘాలయలో ఉంటూ, పెయింటింగ్స్ వేస్తూ, తన ప్రపంచంలో తాను బ్రతుకుంటాడు. ఒకరోజు అనుకోకుండా అడవిలో అఘోరా(రానా దగ్గుబాటి)తో ప్రేమ విషయమై వాదన జరుగుతుంది. ప్రేమపై ఏమాత్రం సదభిప్రాయం లేని మౌళికి.. ఒక పెయింటింగ్ బ్రష్ ని సృష్టించి ఇస్తాడు అఘోర. అయితే ఒకసారి తనకి ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి కావాలో చెప్తూ బొమ్మ గీయగా.. ఆ బొమ్మ లోనుంచి నిజంగానే చిత్ర(పంఖురి గిద్వానీ) అనే అమ్మాయి బయటికొస్తుంది. అయితే చిత్రతో గొడవ కావడంతో.. తనకు కావాల్సిన లక్షణాలు ఇవి కావంటూ మరో బొమ్మ గీస్తాడు. దీంతో చిత్ర మరో క్యారెక్టర్ తో బయటకు వస్తుంది. అసలు అలా ఎందుకు జరుగుతుంది? మౌళి కావాల్సిన లక్షణాలున్న అమ్మాయి దొరికిందా? అసలు మౌళి ప్రేమ గురించి తెలుసుకున్నాడా? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
లవ్ అనేది ఒక మ్యాజిక్. ప్రేమ కథలు ఎన్ని వచ్చినా, ఎన్ని రకాలుగా చెప్పుకున్నా.. ఇంకా ఏదో కొత్త కోణం ఉంటూనే ఉంటుంది. అలా కొత్తదనం నిండిన ప్రేమ కథే 'లవ్ మౌళి'. తనదో ప్రపంచం అన్నట్టుగా బ్రతికే యువకుడు.. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ చిత్ర కథ. లవ్ స్టోరీకి ఫాంటసీ ఎలిమెంట్ ని జోడించి.. ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ లా ఈ సినిమాని మలిచారు. అందమైన లొకేషన్స్ లో.. అంతే అందమైన కథాకథనాలతో నడుస్తూ ఓ మంచి అనుభూతిని పంచుతుంది ఈ చిత్రం. ప్రేమ, పెళ్లికి సంబంధించిన సన్నివేశాలు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మౌళి పాత్రని పరిచయం చేస్తూ కథలోని తీసుకెళ్లిన దర్శకుడు ఫస్టాఫ్ ని నడిపించిన తీరు ఆకట్టుకుంది. ఇక సెకండాఫ్ అంతకుమించి అనేలా ఉంది. కథాకథనాల్లోనే కాకుండా.. ప్రతి సన్నివేశంలోనూ దర్శకుడు వీలైనంత కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. యువత ఈ సినిమాకి ఎంతగానో కనెక్ట్ అవుతారు అనడంలో సందేహం లేదు.
సాంకేతికంగానూ ఈ సినిమా ఆకట్టుకుంది. అజయ్ శివశంకర్ సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచింది. అందమైన లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని చిత్రీకరించడం, దానికి సినిమాటోగ్రాఫర్ ప్రతిభ తోడు కావడంతో.. ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్ లా ఉంది. గోవింద్ వసంత స్వరపరిచిన పాటలు బాగున్నాయి. కృష్ణ నేపథ్య సంగీతం స్టోరీ మూడ్ కి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
నటుడిగా నవదీప్ ఎప్పుడూ నిరాశపరచలేదు. ఈ సినిమాలోనూ మౌళిగా తనదైన నటనతో కట్టిపడేసాడు. ఎమోషన్స్ సీన్స్ లో చక్కగా రాణించాడు. లుక్స్ పరంగానూ స్క్రీన్ మీద కొత్త నవదీప్ కనిపించాడు. చిత్రగా పంఖురి గిద్వానీ మ్యాజిక్ చేసింది. అఘోరాగా ప్రత్యేక పాత్రలో మెరిసిన రానా దగ్గుబాటి అదరగొట్టాడు. భావన సాగి, మిర్చి హేమంత్, కిరణ్, చార్వి దత్త తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా..
ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ లా ఉన్న ఈ సినిమాని హ్యాపీగా చూసేయొచ్చు.
రేటింగ్: 2.75/5
![]() |
![]() |