![]() |
![]() |

'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత హీరో నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. మార్చి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి 'కనుల చాటు మేఘమా' అంటూ సాగే మొదటి పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి మ్యూజికల్ హిట్స్ తర్వాత కళ్యాణి మాలి, శ్రీనివాస్ అవసరాల కలయికలో ముచ్చటగా మూడో సినిమాగా వస్తున్న 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నుంచి 'కనుల చాటు మేఘమా' అంటూ సాగే మొదటి పాట లిరికల్ వీడియోను గురువారం ఉదయం విడుదల చేశారు. కళ్యాణి మాలిక్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. ప్రముఖ సినీ రచయిత లక్ష్మీ భూపాల ఈ పాటకు సాహిత్యం అందించడం విశేషం. "కనుల చాటు మేఘమా.. కాస్త ఆగుమా. వెనుక రాని నీడతో.. రాయబారమా" అంటూ ఆయన కలం నుంచి జాలు వారిన అక్షరాలు ఎంతో అర్థవంతంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ అందమైన పాటను గాయకుడు ఆభాస్ జోషి అంతే అందంగా ఆలపించారు. కళ్యాణి మాలిక్ సంగీతం, లక్ష్మీ భూపాల సాహిత్యం, ఆభాస్ జోషి గాత్రం మూడూ అద్భుతంగా కుదిరి 'కనుల చాటు మేఘమా'ను మధురమైన పాటగా మలిచాయి. లిరికల్ వీడియో చూస్తుంటే ఓ పెళ్లి వేడుకలో కథానాయికను చూస్తూ కథానాయకుడు ఆమెతో గడిపిన క్షణాలను, ఆమె మిగిల్చిన జ్ఞాపకాలను తలచుకుంటూ పాడుతున్నట్లుగా ఉంది. ఈ పాటకు రఘు మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.
'కనుల చాటు మేఘమా' పాట విడుదల సందర్భంగా ఈ పాట రచయిత లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ.. "ఒకప్పుడు నాకు నచ్చిన కాంబినేషన్ వంశీ, ఇళయరాజా. ఇప్పుడు ఈ జనరేషన్ లో అలాంటి కాంబినేషన్ శ్రీనివాస్ అవసరాల, కల్యాణి మాలిక్. వాళ్లిద్దరి కలయికతో వచ్చే సినిమాల్లో పాటలకి ప్రత్యేకత ఉంటుంది.. అందమైన మెలోడీ ఉంటుంది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలో వారి కాంబినేషన్ లో చాలా చక్కటి మెలోడీ ట్యూన్ కి పాట రాసే అవకాశం నాకు రావడం నిజంగా అదృష్టం. 'కనులచాటు మేఘమా' అంటూ సాగే సాహిత్యం అద్భుతంగా కుదిరింది. అతిశయోక్తిలా అనిపించినా నా పాటకు నేనే ఫ్యాన్ అయిన సందర్భం ఇది. ఆభాస్ జోషి ప్రాణం పెట్టేశాడు తన తియ్యని గొంతులో. చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో ఇది ఖచ్చితంగా గుర్తిండిపోయే పాట అవుతుందని నమ్ముతున్నాను" అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. "కథలో ఈ పాట తాలూకు సందర్భం వచ్చినప్పుడు ఇది 'ఏం సందేహం లేదు', 'ఒక లాలన' పాటల స్థాయిలో ఉండాలి అనిపించి వెంటనే కళ్యాణ్ గారికి ఫోన్ చేసి.. "మనం ఒక లవ్ స్టొరీ చేస్తున్నాం అండీ.. అందులో నాకు చాలా ఇష్టమైన సందర్భం ఒకటి వచ్చింది. దానికి ఒక మంచి పాట కావాలి." అన్నాను. కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన మెలోడీని స్వరపరిచారు. లక్ష్మీ భూపాల గారు 'కనుల చాటు మేఘమా.. కాస్త ఆగుమా. వెనుక రాని నీడతో.. రాయబారమా' అంటూ సోల్ ఫుల్ లిరిక్స్ అందించారు. గతంలో నేను సోషల్ మీడియాలో ఆభాస్ జోషి పాటలు విని ఇలాంటి గొంతు మన సినిమాలో ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఇంత మంచి పాటను ఎవరి చేత పాడించాలి అనుకున్నప్పుడు.. ఆభాస్ జోషి గుర్తొచ్చి కళ్యాణ్ గారికి చెప్పాను. ఆయనకు కూడా ఆభాస్ జోషి గాత్రం ఎంతగానో నచ్చింది. సాంగ్ రికార్డింగ్ అయ్యాక కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి.. ఇంతమంచి గొంతుని నాకు పరిచయం చేసినందుకు చాలా థాంక్స్, ఆభాస్ జోషి పాడుతుంటే ఈ పాటకు రెండు చరణాలు కాకుండా యాభై చరణాలు ఉంటే బాగుండు అనిపించి అన్నారు. ఇలాంటి పాటలు చాలా అరుదుగా వస్తాయి. ఈ పాట చాలా తృప్తిని, చాలా ఆనందాన్ని ఇచ్చింది" అన్నారు.
సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ.. "శ్రీనివాస్ గారు ఈ పాట సందర్భాన్ని వివరించినప్పుడు 'లగ్ జా గలే' అనే అద్భుతమైన పాటను రిఫరెన్స్ గా తీసుకోమని చెప్పారు. అంత గొప్ప పాట స్థాయిని అందుకోవడానికి నా శక్తి మేరకు ప్రయత్నించాను. ఈ పాట ఇచ్చిన తృప్తి నా 20 ఏళ్ల సినీ జీవితంలో ఏ పాట ఇవ్వలేదు. ఈ పాట చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని నేను నమ్ముతున్నాను. లక్ష్మీ భూపాల గారు అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఈ పాట విన్నాక లక్ష్మీ భూపాల గారితో నేనొక మాట అన్నాను. మీరు, ఈ పాట పాడిన ఆభాస్ జోషి జాతీయ అవార్డు అందుకుంటారనే నమ్మకం ఉందని చెప్పాను. ఆభాస్ జోషి పేరుని శ్రీనివాస్ గారు సూచించారు. ఆయన గొంతు వినగానే నా మతిపోయింది. అంత గొప్ప గొంతుని పరిచయం చేసిన శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా థాంక్స్. ఈ సినిమాతో పాటు, ఈ సినిమాలో పాటలు చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయని నమ్ముతున్నాను" అన్నారు.
![]() |
![]() |