Home  »  News  »  Jr NTR: ట్విట్టర్లో ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ఎన్టీఆర్.. మామూలు రచ్చ కాదిది!

Updated : Jun 6, 2026

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వెండితెరపై ఎంత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తారో, బయట తన అభిమానులతో అంతే సింపుల్‌గా, సరదాగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ఇద్దరు అభిమానులకి ఇచ్చిన హిలేరియస్ ఫన్నీ రిప్లైలు ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. 

ఎన్టీఆర్‌కు నటనతో పాటు వంట చేయడం (కుకింగ్) అంటే కూడా ప్రాణం. సమయం దొరికినప్పుడల్లా ఆయన కిచెన్‌లోకి వెళ్లి కొత్త వంటకాలను ట్రై చేస్తుంటారు. గతంలో ఆయన స్వయంగా చికెన్ బిర్యానీ వండిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అనేక ఇంటర్వ్యూలలో కూడా తనకు వంట చేయడంపై ఉన్న ఇష్టాన్ని తారక్ బయటపెట్టారు. తన తల్లి శాలిని గారి దగ్గరే తాను వంట నేర్చుకున్నానని, వంట చేయడం తనకు ఒక రకమైన స్ట్రెస్ బస్టర్ అని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ప్రత్యేకమైన వీడియోను పంచుకున్నారు.

తానే స్వయంగా హోమ్‌మేడ్‌గా తయారు చేసిన రుచికరమైన 'చాక్లెట్ చిప్ కుకీస్' బేకింగ్ వీడియోను ఎన్టీఆర్ షేర్ చేశారు. అంతేకాకుండా, ఆ వీడియోకు ఒక సరదా క్యాప్షన్ కూడా జత చేశారు. "ఇవి బయట కొన్నవి కావు.. నేనే స్వయంగా బేక్ చేశాను" అంటూ తారక్ పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. మన అన్నయ్యలో ఈ బేకింగ్ టాలెంట్ కూడా ఉందా అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. 

అయితే, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ వీడియోను చూసిన ఒక నెటిజన్, ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేస్తూ చాలా సరదాగా ట్వీట్ చేశాడు. ఆ ఫ్యాన్ తన ట్వీట్‌లో.. "అన్నా.. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. దయచేసి నాకు రెండు కుకీస్ పంపించు అన్నా" అంటూ రిక్వెస్ట్ చేశాడు.

సాధారణంగా స్టార్ హీరోలు సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వేలాది కామెంట్లను లేదా సరదా ట్వీట్లను పెద్దగా పట్టించుకోరు. కానీ, మన తారక్ రూటే వేరు కదా! ఆ అభిమాని చేసిన ట్వీట్ ఎన్టీఆర్ కంట పడింది. అంతే, ఆయన తనలోని అసలైన కామెడీ యాంగిల్‌ను బయటకు తీశారు. "అడ్రెస్ పెట్టు.. అడ్రెస్ పెట్టు" అంటూ బ్రహ్మానందం మీమ్‌ను ఆ ఫ్యాన్‌కు రిప్లైగా పోస్ట్ చేశారు.

ఇక మరో ఫ్యాన్ అదుర్స్ సినిమాలోని చారి సాంగ్ ని పేరడీ చేస్తూ.. "Where is the biryani..Where is the natukodiii… Tigerrr.. What is this cookiesuuuu.." అంటూ ట్వీట్ చేశాడు. దానికి ఎన్టీఆర్ అదిరిపోయే రిప్లై ఇవ్వడం విశేషం. బాద్షా సినిమాలో "మారాయి అన్నీ మారాయి" అంటూ బ్రహ్మానందం చెప్పే డైలాగ్ మీమ్‌ను రిప్లైగా ఇచ్చారు.

ఆ మీమ్స్ చూసిన వెంటనే నెటిజన్లు, అభిమానులు నవ్వు ఆపుకోలేకపోయారు. క్షణాల వ్యవధిలోనే ఎన్టీఆర్ ఇచ్చిన ఈ ఫన్నీ రిప్లైలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి.

"ఇంత పెద్ద హీరో అయినా కూడా అభిమానుల ట్వీట్‌లకు స్పందించి, ఇలాంటి జోకులు పేల్చడం ఒక్క తారక్‌కే సాధ్యం" అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఏంటి అన్న ఈరోజు మంచి ఫామ్ లో ఉన్నావు" అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో ఇదంతా ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ పని అంటూ ఫన్ చేస్తున్నారు. "భార్గవ్ నాన్నకి ఫోన్ ఇచ్చేయమ్మా" అంటూ కామెంట్లతో నవ్వులు పూయిస్తున్నారు. 

 

https://x.com/tarak9999/status/2062918312598946091

https://x.com/tarak9999/status/2062926211140210819






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.