![]() |
![]() |

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న నయా రూరల్ రొమాంటిక్ డ్రామా 'హుషార్ పిట్టలు' ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ పల్లెటూరి వాతావరణం, టీనేజ్ వయసులో వచ్చే శారీరక, మానసిక మార్పులు, ఆ వయసులో పుట్టే తొలి ప్రేమతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశాలను సహజ సిద్ధంగా తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.
పల్లెటూర్లో పెరిగిన ఒక సాధారణ అమ్మాయి పెద్దమనిషి అయిన తరుణంలో ఆ కుటుంబంలో జరిగే వేడుకతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. టీనేజ్ వయసులోకి అడుగుపెట్టిన తరువాత ఆడపిల్లల ఆలోచనల్లో వచ్చే మార్పులు, అబ్బాయిల పట్ల కలిగే ఆకర్షణ, సమాజంలో ఉండే అపోహలను వినోదాత్మకంగా చూపుతూనే కథలోకి తీసుకెళ్లారు. "మెచ్యూర్ అయిన తర్వాత గర్ల్స్ కి బాయ్స్ టచ్ అయితే.. సర్రుమని కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుందంటగా" అంటూ సాగే సంభాషణలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమాయకత్వాన్ని, అదే సమయంలో ఆ వయసులో కలిగే తుంటరి ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి.
రవి(హీరో) అనే కుర్రాడితో హీరోయిన్ కు ఏర్పడే పరిచయం, ఆపై అది ప్రేమగా మారడం కథలోని అసలు మలుపుకు బాటలు వేస్తుంది. కోరికలు అదుపు చేసుకోలేక.. వీడియో కాల్స్ చేసుకోవడం, శారీరికంగా కలవడం వంటి సీన్స్ కనిపిస్తాయి.
అయితే, వయసుతో వచ్చే ఆకర్షణను నిజమైన ప్రేమగా భావించి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే, ఆ ప్రభావం కన్నవారిపై ఎంత దారుణంగా పడుతుందో చూపించే క్రమంలో కథ సీరియస్ మోడ్‌లోకి మారుతుంది. "కన్నవాళ్ళ ప్రేమ కావాలా? ప్రేమించినోడి ప్రేమ కావాలా?" అనే ప్రశ్న ఈ చిత్రంలోని ప్రధాన సంఘర్షణను ఎంతో బలంగా ఆవిష్కరిస్తుంది.
ఈ క్రమంలో వచ్చే తల్లిదండ్రుల భావోద్వేగ సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ముఖ్యంగా"ఆడిపిల్లను కన్నాం కదా.. దండం పెట్టాల్సి వస్తది, కాళ్ళు మొక్కాల్సి వస్తది" వంటి డైలాగ్స్ హత్తుకునేలా ఉన్నాయి.
ట్రైలర్ చివరిలో హీరోయిన్ తాను ప్రెగ్నెంట్ అయినట్టుగా.. హీరోకి సైగ చేసి చెప్తుంది. చరణ్ అర్జున్ అందించిన సంగీతం ఈ సన్నివేశాలలోని గాఢతను మరింత పెంచింది. ముఖ్యంగా "క్షణ సుఖముకై వందేళ్లను బలి చేయడం నీకు న్యాయమా" అంటూ సాగే సాహిత్యం యువతకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తూ ఆలోచింపజేస్తోంది.
అప్పట్లో 'చిత్రం' సినిమా కూడా ఈ తరహా కథతోనే వచ్చి సంచలనం సృష్టించింది. మరి ఇప్పుడు ఈ 'హుషార్ పిట్టలు' ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Hushar Pittalu Trailer, Vasavi Ganeshan, Telugu Cinema
![]() |
![]() |