![]() |
![]() |

భారీ సినిమాలు వాయిదా పడటం కామన్ అయిపొయింది. ఇప్పుడు అదే కోవలో 'హరి హర వీరమల్లు', 'VD12' సినిమాలు వాయిదా పడుతున్నాయి. అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ సినిమాల వాయిదాపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. (Hari Hara Veera Mallu)
పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు'. ఎప్పుడో ఐదేళ్ల క్రితం ప్రకటించిన ఈ సినిమా పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు కాగా, షూటింగ్ బాగా ఆలస్యమవుతుండటంతో ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'ఘాటి'తో బిజీ అయ్యాడు. దీంతో 'హరి హర వీరమల్లు' మిగిలిన భాగాన్ని పూర్తి చేసే బాధ్యత యువ దర్శకుడు జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. ఈ క్రేజీ మూవీని మార్చి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అదే రిలీజ్ డేట్ తో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అయినప్పటికీ ఈ చిత్ర విడుదల తేదీపై కొద్దిరోజులుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు అదే తేదీకి విడుదల కాబోతున్నట్లు మరో సినిమా ప్రకటన రావడంతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం 'రాబిన్ హుడ్'. ఈ మూవీని మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కి నితిన్ వీరాభిమాని. పవన్ సినిమాకి పోటీగా తన సినిమాని విడుదల చేసే సాహసం నితిన్ చేయకపోవచ్చు. దీనిని బట్టి చూస్తే 'హరి హర వీరమల్లు' వాయిదా పడుతుందని మేకర్స్ నుంచి ఉన్న సమాచారంతోనే.. 'రాబిన్ హుడ్' టీం మార్చి 28 డేట్ ని లాక్ చేసి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక మార్చి 28 పై కర్చీఫ్ వేసిన మరో సినిమా 'VD12' కూడా పోస్ట్ పోన్ అయిందనే క్లారిటీ వచ్చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాని మార్చి 28న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే అదే తేదికి 'హరి హర వీరమల్లు' వస్తే, 'VD12' వాయిదా పడటం ఖాయమనే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు 'హరి హర వీరమల్లు' విడుదలతో సంబంధం లేకుండానే 'VD12' వాయిదా ఖాయమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ తాము నిర్మిస్తున్న మరో మూవీ 'మ్యాడ్ స్క్వేర్'ను మార్చి 29న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా అనౌన్స్ చేసింది. దీంతో 'VD12' పోస్ట్ పోన్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా ఏప్రిల్ లేదా మేలో విడుదలయ్యే అవకాశముంది.
![]() |
![]() |