Home  »  News  »  Epic Teaser: ఫుల్ మార్క్స్ సాధించిన 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' టీజర్

Updated : Apr 29, 2026

'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' (EPIC First Semester) ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ చిత్రం ఒక హృద్యమైన అనుభూతిని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట 'సంచారమే' అద్భుతమైన స్పందనను సొంతం చేసుకోగా, తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. (Epic Teaser)

'ఎపిక్' టీజర్ అందమైన అనుభూతిని అందిస్తూ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య కథను కేంద్రీకరిస్తుంది. ‘బేబీ’ సినిమా తర్వాత ఈ జంటకు ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ హిట్ పెయిర్ సరికొత్తగా మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది.

90’s వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ సినిమాతో వెండితెరపై అడుగుపెడుతున్నారు. తాజాగా విడుదలైన టీజర్, మొదటి సినిమాతోనే ఆయన ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోబోతున్నారనే నమ్మకాన్ని కలిగిస్తోంది. 

హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని తొలి గీతం “సంచారమే” ఇప్పటికే అన్ని ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండ్ అవుతూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇక టీజర్ లోనూ తనదైన నేపథ్య సంగీతంతో మెప్పించారు హేషమ్ అబ్దుల్ వహాబ్.

లండన్ నేపథ్యంతో సాగే ఈ చిత్రం ఒక అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా కనిపిస్తోంది. ఆధునిక సంబంధాలు, ప్రేమలో మారుతున్న భావోద్వేగాలను ఈ సినిమా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రేమకథలో ఆనంద్ దేవరకొండ ఇంట్రోవర్ట్ (అంతర్ముఖుడు) పాత్రలో కనిపిస్తుండగా, వైష్ణవి చైతన్య పూర్తి విరుద్ధంగా ఎక్స్‌ట్రోవర్ట్ (బహిర్ముఖురాలు) పాత్రలో ఆకట్టుకోనున్నారు. విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? వారి ప్రయాణం ఎలా సాగింది? అనేది టీజర్‌లో ఎంతో హృద్యంగా చూపించారు.

హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో జరిగిన 'ఎపిక్' టీజర్ ఆవిష్కరణ వేడుకలో కథానాయకుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. "ఎపిక్ టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎపిక్ సినిమా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆదిత్య హాసన్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది. ఎందుకంటే నేనూ విదేశాల్లో చదువుతున్నాను. ఇందులోని చాలా సన్నివేశాలు నాకు కనెక్ట్ అయ్యాయి. విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళకు మాత్రమే కాదు.. ఈ కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. కుటుంబం, ప్రేమ, బంధం, భావోద్వేగాలు ఇలా ప్రతిదీ మీ మనసుకు నచ్చుతాయి. దర్శకుడు ఆదిత్య హాసన్ లో ఎంతో ప్రతిభ ఉంది. భవిష్యత్తులో ఆదిత్యను స్ఫూర్తిగా తీసుకొని ఎందరో కొత్త దర్శకులు వస్తారు. వైష్ణవి చైతన్య లాంటి ప్రతిభగల నటితో నటించడం సంతోషంగా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి సంస్థలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. సార్, లక్కీ భాస్కర్, టిల్లు, మ్యాడ్, జెర్సీ లాంటి సినిమాల సరసన ఎపిక్ చేరుతుందనే నమ్మకం ఉంది. మన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది మన కథే కదా అనిపిస్తుంది. ఇందులో హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం మనసు పెట్టి పనిచేశారు." అన్నారు.

కథానాయిక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. "ముందుగా 'సంచారమే' పాటపై ప్రేమను కురిపించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. ఎపిక్ కథ నాకు చాలా నచ్చింది. కథ వినగానే నేను ఈ సినిమాలో భాగం కావాలి అనుకున్నాను. నేను పోషించిన కడలి పాత్ర చాలా బాగుంటుంది. కథ వినేటప్పుడు ఆ కడలి నాలో ఉందేమో అనిపించింది. చాలామంది అమ్మాయిల్లో ఆ కడలి ఉంటుంది అనిపించింది. ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర కూడా బాగుంటుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. ఎపిక్ నా మనసుకి దగ్గరైన సినిమా. ఇదొక అందమైన ప్రేమ కథ. మనల్ని మనం చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే మన స్నేహితులు గుర్తుకొస్తారు. మీ కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి." అన్నారు.

దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. "ఈ సినిమా ప్రతి ఒక్కరికీ చేరువయ్యే ప్రేమకథ. కథ రాస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందని నమ్మాను. చిత్ర విజయం పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాము. బంధాలను, భావోద్వేగాలను గొప్పగా చూపించడానికి మా శాయశక్తులా కృషి చేశాము. ఇది కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం. 90’s వెబ్ సిరీస్‌ తీసినట్టుగానే ఈ సినిమాను కూడా సహజంగా తెరకెక్కించాము. మీ తల్లిదండ్రులతో కలిసి ఈ సినిమాను చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను." అన్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేస్తోంది. అజీమ్ మహమ్మద్ ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్న ఈ చిత్రానికి కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే “సంచారమే” గీతం మ్యూజికల్ హిట్‌గా నిలవగా, తాజాగా విడుదలైన టీజర్ అందరినీ కట్టిపడేస్తోంది. 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి భారీ విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలో సినిమాకు సంబందించిన మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్ రానున్నాయి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.