![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ (NBK112) పట్టాలెక్కబోతోందని వార్తలు రాగానే నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. కొరటాల శివ సినిమాల్లో హీరోల పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా, అర్థవంతంగా ఉంటాయి. బాలయ్య లాంటి మాస్ హీరోకు కొరటాల మార్క్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని చెప్పవచ్చు. అయితే, ప్రస్తుతం ఈ సినిమా విషయంలో దర్శకుడు కొరటాల ఒక ప్రధాన సమస్యతో సతమతమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కొరటాల శివ సినిమాల్లో కథ ఎంత ముఖ్యమో, సంగీతం కూడా అంతే కీలకం. గతంలో దేవిశ్రీ ప్రసాద్‌తో ఆయనకు 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' వంటి మ్యూజికల్ హిట్ ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారి 'ఎల్లమ్మ' అనే సినిమా చేస్తుండటం వల్ల.. ఆయన అందుబాటులో లేరు.
మరోవైపు వరుసగా బాలకృష్ణ సినిమాలకు పనిచేస్తూ 'నందమూరి తమన్' అనిపించుకున్న 'తమన్' పేరు పరిశీలనలోకి వచ్చింది. అయితే బాలయ్య సినిమాలకు ఆయన ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నప్పటికీ, పాటల విషయంలో కొంత రొటీన్ అనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా కోసం కొత్తగా ఎవరిని ఎంచుకోవాలనేది కొరటాలకు సవాలుగా మారింది.
ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, 2027 సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర బృందం భావిస్తోంది. అందుకే కొరటాల గత చిత్రం 'దేవర'కు సంగీతం అందించిన అనిరుధ్ పేరు పరిశీలించట్లేదని తెలుస్తోంది. అనిరుధ్ విషయంలో రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి ఆయన షెడ్యూల్స్ చాలా బిజీగా ఉన్నాయి. రెండు ఆయన పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు.
ఈ నేపథ్యంలోనే సినిమా స్పీడ్‌కు ఏమాత్రం బ్రేక్ పడకుండా.. అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతాన్ని అందించే సరైన మ్యూజిక్ డైరెక్టర్ కోసం కొరటాల శివ తీవ్రంగా అన్వేషిస్తున్నారు.
బాలయ్య - కొరటాల కాంబోలో సినిమా అనగానే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఆ అంచనాలను అందుకునేలా సరైన సంగీతాన్ని అందించే టెక్నీషియన్‌ను కొరటాల త్వరలోనే ఖరారు చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
![]() |
![]() |