Home  »  News  »  జెన్ జీ మాస్ ఊచకోత 'దందా'.. సినిమాల కంటే మైక్రో డ్రామాలను తీయడమే కష్టం.!

Updated : Aug 5, 2026

వర్టికల్ స్టోరీస్‌లో చాయ్ షాట్స్ నుంచి వచ్చిన ‘దందా’ సిరీస్ సెన్సేషనల్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘దందా’తో దర్శకుడు ఆదిత్య దేవులపల్లి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తన సినీ జర్నీ, నేపథ్యం గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.

మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పండి?
నేను చదువులో టాపర్‌నే, కానీ చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలంటే పిచ్చి. ఆ ప్యాషన్‌తోనే ఇంజనీరింగ్ మధ్యలోనే వదిలేసి రాడికల్ డెసిషన్ తీసుకున్నా. ఇంట్లో కెమెరా మీద ఉన్న ఆసక్తిని చెప్పడంతో ఓ చిన్న కెమెరా కొనిచ్చారు. ఇండస్ట్రీలో నాకంటూ ఎవరూ లేరు, ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా ఫోటోగ్రఫీ నేర్చుకుని ఇక్కడికి వచ్చా. ఆ తర్వాత సెయింట్ మేరీస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్‌లో చేరా. అక్కడ నా ప్రొఫెసర్ అమృత్ సార్‌కి కూడా సినిమా అంటే పిచ్చి. ఆయన వల్లే ఫ్రెంచ్, ఇంగ్లీష్‌తో సహా వరల్డ్ సినిమా వైపు నా చూపు మళ్ళింది. ఆ తర్వాత జర్నలిజంలోకి వచ్చి కాంటాక్ట్స్ పెంచుకున్నా. ఆ క్రమంలోనే చాయ్ బిస్కెట్ అనురాగ్ అన్నకి ఓ వైలెంట్ కథ నరేట్ చేశా. నేను ఎప్పుడు అనుకునే వాడిని నేను 28 years కల్లా డైరెక్టర్ అవ్వాలి అని, అయ్యాను 

చాయ్ షాట్స్‌లోకి ఎంట్రీ ఎలా జరిగింది?
నేను చెప్పిన కథ అనురాగ్ అన్నకి బాగా నచ్చింది. "తెలుగులో సాధారణంగా ఇలాంటి కథను తీసే ధైర్యం ఎవరూ చేయరు" అని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ నన్ను పిలిచి మాట్లాడారు. అప్పటికే నేను జర్నలిజంలో ఉన్నా, ఆయన కొత్తగా చాయ్ షాట్స్ ప్రారంభించి నన్ను క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా జాయిన్ అవ్వమన్నారు. అక్కడ కొన్ని షోస్ చేసిన తర్వాత, నాకు అదంతా రొటీన్ గా, ఏమాత్రం ఎగ్జైటింగ్ లేదనిపించింది. దాంతో నేరుగా అనురాగ్ అన్న దగ్గరకే వెళ్లి, "నేను నీకో క్రేజీ షో డైరెక్ట్ చేసి చూపిస్తా" అని పట్టుబట్టి చెప్పా. అలా ‘దందా’ ప్రయాణం మొదలైంది.

‘దందా’ కథలో మీ ప్రమేయం ఎంతవరకు ఉంది?
ఒరిజినల్ కథను విజయ్ కుమార్ రాశాడు, కానీ అందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను మొత్తం రీ-రైట్ చేసి కథకు ఒక కంప్లీట్‌నెస్‌ తీసుకొచ్చా. గణేష్ ఠాకూర్, అరవింద్, ప్రకాష్ ఠాకూర్ క్యారెక్టర్ బ్యాక్‌గ్రౌండ్స్‌తో సహా దాదాపు 40 శాతం మార్పులు చేశాను. ఆ తర్వాతే దొరసాయి తేజ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాడు.

‘దందా’కి వస్తున్న రెస్పాన్స్ అండ్ అప్రిషియేషన్ ఎలా ఉంది?
ఇప్పటివరకు ‘దందా’కి ఒక్కటంటే ఒక్క నెగెటివ్ రివ్యూ కూడా రాలేదు. ప్రతీ ఒక్కరూ ఈ ఫ్రెష్ మేకింగ్ స్టైల్, స్ట్రాంగ్ కంటెంట్‌ను విపరీతంగా పొగుడుతున్నారు. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. సిరీస్ బాలేదని ఒక్కడు కూడా అనలేదు. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం అనురాగ్ అన్నకి ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ప్రతీ సీన్ చాలా ఫాస్ట్ పేస్డ్‌గా, ఎంగేజింగ్‌గా ఉందంటుంటే చాలా గర్వంగా ఉంది.

సొంత కథ కాకుండా ‘దందా’తోనే డైరెక్టర్‌గా ఎందుకు డెబ్యూ చేశారు?
నాకు పూరీ జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ, ఉపేంద్ర లాంటి డైరెక్టర్ల మేకింగ్ అన్నా, ఆటిట్యూడ్ అన్నా చాలా ఇష్టం. చాయ్ షాట్స్‌లో ఉన్నప్పుడు వందలాది స్క్రిప్ట్‌లు విన్నాను. కానీ ‘దందా’ కథ చదువుతుంటే నన్ను నేనే చూసుకున్నట్టు అనిపించింది. అచ్చం నా రా నెస్ (Raw style) ఉన్న కథలా అనిపించింది. విజయ్ అద్భుతంగా రాశాడు. క్రెడిట్స్ విషయంలో నాకు కానీ, విజయ్‌కి కానీ ఎలాంటి ఈగోలు లేవు. నేను కథను రీషేప్ చేయడానికి విజయ్ కూడా హ్యాపీగా ఒకే అన్నాడు. వర్టికల్ స్టోరీ టెల్లింగ్‌లో నా మార్క్ డైరెక్షన్‌తో ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలనుకున్నా. చాయ్ షాట్స్ ఆఫీస్‌లో నేను చేసిన డెమో చూసి అంతా ఫిదా అయిపోయారు. వర్టికల్‌లో సరైన స్ట్రాంగ్ కంటెంట్ లేకపోవడంతో, ‘దందా’తో ఒక ప్రాపర్ సినిమాటిక్ ట్రెండ్ తీసుకురావాలని ఫిక్స్ అయ్యా.

వర్టికల్ కంటెంట్ కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు?
ప్రస్తుతం మైక్రో డ్రామాలను జనాలు విపరీతంగా చూస్తున్నారు. కానీ వర్టికల్ ఫార్మాట్‌లో ప్రతీ సీన్ గ్రిప్పింగ్‌గా ఉండాలి. మామూలు సినిమాల్లో అయితే ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో హైస్ అండ్ లోస్ ఉంటాయి. కానీ వర్టికల్‌లో ప్రతీ సీన్ ఒక క్లైమాక్స్ లాగే ఉండాలి! నిజం చెప్పాలంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాలు తీయడం కంటే మైక్రో డ్రామాలు తీయడం చాలా కష్టం. ఈ పేసింగ్ చూస్తే, బయట ఉన్న బిగ్ మూవీ డైరెక్టర్లలో 80% మంది మైక్రో డ్రామా తీస్తే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సెటప్ చేయడానికి ఇక్కడ టైమ్ ఉండదు. మొదటి సెకన్ నుంచే ఆడియెన్స్‌ను హుక్ చేయాలి. ఇది చాలా ఛాలెంజింగ్ అండ్ ఎగ్జైటింగ్ జర్నీ.

డైలాగ్స్ గురించి చెప్పండి?
ఈ పవర్‌ఫుల్ డైలాగ్స్ అన్నీ అరవింద్ క్యారెక్టర్ జర్నీ నుంచే పుట్టుకొచ్చాయి. చిన్నతనం నుంచే లైబ్రరీలో ఉంటూ, మనుషులను గమనించడం వల్ల ఆ పాత్రకు ఒక డెప్త్ వచ్చింది. ఆ క్యారెక్టరే మాతో ఇంకా కొత్తగా, ఫ్రెష్‌గా లైన్స్ రాయించింది.

కాస్టింగ్ సెలెక్షన్ ఎలా జరిగింది?
అరవింద్ పాత్ర కోసం చాలామందిని అనుకున్నాం, ఫైనల్‌గా దొరసాయి తేజను ఓకే చేశాం. ఆరంభంలో అతని చుట్టూ ఉన్న కాంట్రవర్సీలు చూసి కొన్ని అనుమానాలు ఉండేవి, కానీ కలిసిన తర్వాత తేజ ఎంత వండర్ఫుల్ పర్సనో అర్థమైంది. కథ వినగానే ఆశ్చర్యపోయి, వెంటనే మార్కెటింగ్, నంబర్స్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అంత క్లియర్ విజన్, లాంగ్ టర్మ్ థింకింగ్ ఉన్న వ్యక్తి తేజ. చాలామంది లీడ్ యాక్టర్లు ఇవ్వని 'బ్లైండ్ ట్రస్ట్' నా మీద, ‘దందా’ మీద ఉంచాడు. అలాగే నితిన్ ప్రసన్న గారికి కథ చెప్పగానే ఆయన వెంటనే ఒకే చెప్పారు.

మ్యూజిక్ అండ్ కెమెరా వర్క్ గురించి?
నేను నా ప్రాజెక్ట్‌లో కెమెరా షాట్ నుంచి మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ వరకు ప్రతీ ఒక్కటి దగ్గరుండి డిజైన్ చేసుకునే టైప్ మేకర్‌ని. అందుకే నా విజన్‌ను అర్థం చేసుకునే టీమ్ నా పక్కన ఉండాలనుకున్నా. కేరళలో ఉన్న నా ఫ్రెండ్స్ ద్వారా కెమెరామెన్ అశ్విన్ లెనిన్ పరిచయమయ్యాడు. అతనికి ‘దందా’ విజన్ చెప్పగానే, కరెన్సీ నోట్ల ఆధారంగా డిజైన్ చేసిన ప్రత్యేకమైన కలర్ ప్యాలెట్‌ను క్రియేట్ చేసి, బెస్ట్ లెన్సెస్‌తో క్రేజీ విజువల్స్ ఇచ్చాడు.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ రిషి ఎమ్ నా మంచి ఫ్రెండ్. షూటింగ్ ప్రారంభం కాకముందే మెజారిటీ మ్యూజిక్ కంపోజ్ చేసేశాడు! ఎంత కూల్ అంటే—నేను పలానా ఇన్‌స్ట్రుమెంట్ వాడమని చెప్పినా, లేదా అతను చేసిన కంపోజిషన్‌ను రిజెక్ట్ చేసినా ఏమాత్రం ఈగో తీసుకోకుండా కొద్ది నిమిషాల్లోనే మైండ్ బ్లోయింగ్ అవుట్‌పుట్ ఇచ్చేవాడు. టాలీవుడ్‌కి దొరికిన ఒక క్రేజీ అండ్ ఫ్రెష్ మ్యూజిక్ టాలెంట్ రిషి!

రాజమౌళి గారు కేమియో చేశారా?
(నవ్వుతూ) రాజమౌళి సర్ ఒక లెజెండ్.. హి ఈజ్ ది GOAT! నా డైరెక్షన్‌లో వచ్చే ప్రాజెక్ట్‌లో ఆయన భాగం కావాలనే చిన్న కోరిక ఉండేది, కానీ ఆయన్ని నేరుగా అప్రోచ్ అయ్యే స్థాయి నాకు లేదు. అందుకే సైబర్ క్రైమ్‌పై ఆయన చేసిన ఓ అవేర్‌నెస్ వీడియోను ఆయనకిచ్చే ట్రిబ్యూట్‌గా ఈ సిరీస్‌లో వాడుకున్నాం.

‘దందా’తో ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకున్నారా?
నేను ‘దందా’ని 100% ఎంటర్‌టైన్‌మెంట్ మైండ్‌సెట్‌తోనే తీశాను. కానీ దాంతో పాటు సమాజానికి కాస్త ఉపయోగపడే విషయాలు చెబితే 'విన్-విన్' అవుతుంది కదా అనిపించింది. అందుకే సైబర్ క్రైమ్స్ వెనుక ఉన్న దారుణాలను వారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూపించాం. సైబర్ నేరగాళ్లు వేల కోట్లు కొల్లగొడుతున్నారు, కానీ మనం వాళ్లను పట్టుకోలేకపోతున్నాం. ఒక చిన్న OTPతో లక్షలు మాయమైపోతున్నాయి. ప్రోటాగానిస్ట్ ద్వారా ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తూనే, ఈ సైబర్ నేరగాళ్ల అసలు రూపాన్ని బయటపెట్టి జనాల్లో అవేర్‌నెస్ తేవాలని ఈ కథను డిజైన్ చేశా.

హీరోయిన్ క్యారెక్టర్ గురించి?
మన సినిమాల్లో ఒక అమ్మాయి పాదాలను అంతగా ఫోకస్ చేసి చూపించలేదు (నవ్వుతూ). అరవింద్ చిన్నతనంలో ఎప్పుడూ నేల మీదే నిలబడి ఉండేవాడు, ఆ పర్స్పెక్టివ్ వల్లే అతనికి పాదాలను గమనించే అలవాటు వచ్చి ఉంటుంది. అక్షరను కలిసినప్పుడు కూడా నేను ఈ పాయింట్ గురించే మాట్లాడా (నవ్వుతూ). తను అద్భుతంగా నటించింది. అరవింద్‌గా తేజ, నీరుగా అక్షర పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు.

తేజ పర్ఫార్మెన్స్ గురించి మీ కామెంట్?
తేజ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. తనని చూడటానికి జనాలు రూ. 200 లేదా రూ. 250 టికెట్ కొని థియేటర్‌కి వచ్చే స్థాయికి ఎదగాలనే కసి అతనిలో ఉంది. ‘దందా’ని గుడ్డిగా నమ్మి నాకోసం 1000% ఇచ్చాడు. ఎంత బ్లైండ్ ట్రస్ట్ అంటే.. తను చేసిన సీన్ కరెక్ట్‌గా వచ్చిందో లేదో చూడటానికి మానిటర్ వైపు కూడా చూడడు! తేజ నటనలోని అసలు పవర్ ఇంకా చాలామంది చూడలేదు. 28వ ఎపిసోడ్‌లో తను చెప్పిన మోనోలాగ్ డైలాగ్ ఒకే ఒక్క సింగిల్ టేక్‌లో చేశాడు! నన్ను మైండ్ బ్లోయింగ్ అనిపించాడు. తేజ గ్రేట్ నటుడు, టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ అవుతాడు.. ఇది నా గ్యారెంటీ! నిమిషం గ్యాప్ లేకుండా పనితో బిజీగా ఉన్నా, సెట్‌కి వస్తే కంప్లీట్ డెడికేషన్‌తో ఉంటాడు. నా నెక్స్ట్ ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిలిం పక్కా తేజతోనే ఉంటుంది.. అదీ ‘దందా’ కంటే ఐదు రెట్లు వైల్డ్‌గా ఉంటుంది!

‘దందా’ సక్సెస్‌పై మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి?
నాలో ఉన్న ఈ ఫైర్ మా అమ్మ నుంచి వచ్చిందే! ఆమె తరచూ చెప్పే “రాజు కంటే మొండోడే బలవంతుడు” అనే డైలాగ్‌నే సిరీస్‌లో వాడాను. మా నాన్నకి హీస్ట్ సినిమాలు అంటే పిచ్చి ఇష్టం. ‘మనీ హీస్ట్’ సిరీస్‌ను ఎన్నోసార్లు చూశారు. నేను ఈ కథ చెప్పగానే, "ఇది పక్కా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది" అని చెప్పేశారు.

ఫైనల్‌గా ‘దందా’ గురించి ఏం చెప్తారు?
అసలైన "జెన్ జీ మాస్" అంటే ఏంటో తెలియాలంటే ‘దందా’ చూడాల్సిందే! ఒక్క సెకన్ కూడా వేస్ట్ కాకుండా ప్రతీ ఫ్రేమ్ పరిగెడుతుంది. సిరీస్ చూశాక మేమందరం మీ మైండ్‌లో ఉండిపోతాం. మైక్రో డ్రామానే కదా అని తక్కువ అంచనాతో చూడటం స్టార్ట్ చేయండి.. మా సిరీస్ మీ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది!

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
ప్రస్తుతం ఒక 50 ఏళ్ల నేరస్థుడి చుట్టూ తిరిగే పవర్‌ఫుల్ స్టోరీ రాస్తున్నా. అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోయే రెండు మూడు నెలల్లో వస్తుంది.

https://www.instagram.com/reel/DbXN8DjFM5P/

 

Dora Sai Teja, Dhandha, Aditya Devulapalli, Interview

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.