![]() |
![]() |
క్యాన్సర్‌కు ఎవ్వరూ అతీతులు కాదు. అది ఎవరినైనా కబళిస్తుంది. అయితే కొందరు దానిపై పోరాటం చేసి జయిస్తున్నారు, మరికొందదు దాని బారి నుంచి తప్పించుకోలేక మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతున్నారు. క్యాన్సర్‌ను జయించిన వారు సినిమా సెలబ్రిటీల్లో నార్త్ నుంచి సౌత్ వరకు ఎంతో మంది ఉన్నారు. వారిలో నటీమణి హంసానందిని ఒకరు. రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఆమె.. దాన్నుంచి బయటపడేందుకు పెద్ద పోరాటమే చేసింది. అయితే చివరికి క్యాన్సర్‌ను జయించింది. ఈ వ్యాధి జన్యుపరంగా తన తల్లి నుంచి సంక్రమించింది. వ్యాధి సోకిన తర్వాత హంసానందిని ఎంతో మానసిక క్షోభకు గురయ్యారు. అయినా పట్టుదలతో దాన్ని జయించి ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు స్ఫూర్తిగా నిలిచారు. అప్పటి నుంచి క్యాన్సర్ బాధితుల్లో అవగాహన పెంచేందుకు ఏదో ఒక వీడియోతో సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు.
తాజాగా నేడు నేషనల్ క్యాన్సర్ డే సందర్భంగా హంసానందిని మరో వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసారు. అందులో క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు తన తల్లి పేరు మీద ‘యామిని క్యాన్సర్ ఫౌండేషన్’ను నెలకొల్పనున్నట్టు తెలిపారు. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా పౌండేషన్‌కి సంబంధించిన మెయిల్ ద్వారా తమ సమస్యని వివరించవచ్చునని పేర్కొన్నారు. రెగ్యులర్ సెల్ఫ్ చెకప్స్.. మామోగ్రఫీ.. జెనెటిక్ పరీక్షలు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా చేయించుకొంటే క్యాన్సర్ బారిన పడకుండా రక్షించుకోవచ్చని చెబుతున్నారు. బ్రెస్ట్ కేన్సర్, దానికి సంబంధించిన చికిత్సల గురించిన సమాచారం దేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నది తన లక్ష్యమని హంసానందిని చెబుతున్నారు.
![]() |
![]() |