Home  »  News  »  The Odyssey: 'ది ఒడిస్సీ' భయం.. నొలన్ దెబ్బకు రిలీజ్ డేట్స్ మార్చుకుంటున్న బాలీవుడ్ సినిమాలు!

Updated : Jun 12, 2026

భారీ పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయంటే చిన్న చిత్రాలు లేదా ఇతర ప్రాంతీయ సినిమాలు తమ విడుదల తేదీలను సర్దుబాటు చేసుకోవడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఒకే ఒక్క హాలీవుడ్ దర్శకుడి పేరు విని నార్త్ సినీ ప్రపంచం వణికిపోతోంది. ఆ లెజెండరీ దర్శకుడు మరెవరో కాదు, తన విలక్షణమైన మేకింగ్ స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకున్న క్రిస్టోఫర్ నొలన్ (Christopher Nolan). 

గతంలో ఆయన అందించిన 'ఒపెన్‌హైమర్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రీక్ మైథలాజికల్ హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామా 'ది ఒడిస్సీ' (The Odyssey) విడుదల కాబోతుండటంతో బాలీవుడ్ అగ్ర నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ సినిమా జులై 17న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. నొలన్ సృష్టించబోయే బాక్సాఫీస్ సునామీకి అడ్డుగా నిలిస్తే తమ సినిమాలు నష్టపోవడం ఖాయమని భావించిన బాలీవుడ్ మేకర్స్, తమ సినిమాలను ప్రీపోన్ చేసుకునే పనిలో పడ్డారు.

ఈ జాబితాలో మొదటిగా నిలిచింది బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరీ వాగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వైఆర్ఎఫ్ (YRF) స్పై యూనివర్స్ మోస్ట్ యాంటిసిపేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha). శివ్ రావైల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం గతంలో పలుమార్లు వాయిదా పడింది. గతేడాది క్రిస్మస్ రేసు నుండి తప్పుకుని ఈ ఏడాది ఏప్రిల్‌కు, ఆ తర్వాత జులై 10వ తేదీకి పోస్ట్‌పోన్ అయింది. అయితే జులై 17న 'ది ఒడిస్సీ' వస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద కనీసం రెండు వారాల పాటు ఎలాంటి పోటీ లేకుండా సోలో రన్ దక్కించుకోవాలని నిర్మాత ఆదిత్య చోప్రా భావించారు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇటీవలే ఒక క్రేజీ టీజర్ వదిలి 'ఆల్ఫా' చిత్రాన్ని వారం రోజుల ముందుకు జరుపుతూ జులై 3నే థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు యశ్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. 

ఇదే దారిలో బాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్ ఫ్రాంచైజ్ ఫిల్మ్ 'ధమాల్ 4' (Dhamaal 4) కూడా యూటర్న్ తీసుకుంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమాను జులై 17న విడుదల చేయాలని మేకర్స్ ఫైనల్‌గా ఫిక్స్ అయ్యారు. కానీ సరిగ్గా అదే రోజు క్రిస్టోఫర్ నొలన్ సినిమా వస్తుండటంతో థియేటర్ల కొరత ఏర్పడుతుందని గ్రహించిన నిర్మాతలు, సడెన్ నిర్ణయంతో ఈ సినిమాను కూడా వారం రోజులు ముందుకు జరిపి జులై 10కి మార్చేశారు.

హాలీవుడ్ సినిమా అంటే ఓవర్సీస్‌లోనే కాకుండా ఇండియాలో కూడా ఈ స్థాయి మేనియా ఉండటం ట్రేడ్ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. సినిమా చరిత్రలోనే 100 శాతం పూర్తిగా ఐమాక్స్ (IMAX) కెమెరాలతో చిత్రీకరించిన మొదటి ఫీచర్ ఫిల్మ్‌గా 'ది ఒడిస్సీ' సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా కోసం నొలన్ దాదాపు 20 ఏళ్లుగా వర్క్ చేయడం విశేషం. ఈ చిత్రంలో మ్యాట్ డామన్, టామ్ హాలండ్, జెండయా, అన్నే హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్ లాంటి అంతర్జాతీయ భారీ తారాగణం నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 

భారతదేశంలో ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందంటే, మన లోకల్ సినిమాలకు వెయ్యి రూపాయలు టికెట్ రేటు పెడితేనే గగ్గోలు పెట్టే ప్రేక్షకులు, ఈ సినిమా ఐమాక్స్ టికెట్ ధర ఏకంగా 3,000 రూపాయలు చెబుతున్నా కూడా వెనకాడకుండా కొనేస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రికార్డు స్థాయిలో 1.5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం ఐదు వారాల ముందే ఇండియాలో ఈ చిత్రం సుమారు 2 కోట్ల రూపాయల భారీ ప్రీ-సేల్స్ గ్రాస్‌ను వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. థియేటర్లలో బెస్ట్ సీట్లన్నీ హాట్ కేకుల్లా క్షణాల్లో మాయమైపోతున్నాయి. హాలీవుడ్ డైరెక్టర్ క్రియేట్ చేసిన ఈ మాస్ హిస్టీరియా చూసి తట్టుకోలేక బాలీవుడ్ చిత్రాలు పోటీ నుండి తప్పుకోవడమే ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.