![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'అంటే సుందరానికీ'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని ఈ సమ్మర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఏడు విడుదల తేదీలను ప్రకటించి అందరూ ఆశ్చర్యపడేలా చేశారు మేకర్స్.
థర్డ్ వేవ్ కారణంగా జనవరి, ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన పలు సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతుండటంతో రాధేశ్యామ్(మార్చి 11), 'ఆర్ఆర్ఆర్'(మార్చి 25), ఆచార్య(ఏప్రిల్ 29), సర్కారు వారి పాట(మే 12) ఇలా పలు సినిమాలు కొత్త విడుదల తేదీలను ప్రకటించాయి. అయితే భీమ్లా నాయక్(ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1), రామారావు ఆన్ డ్యూటీ(మార్చి 25 లేదా ఏప్రిల్ 15), గని(ఫిబ్రవరి 25 లేదా మార్చి 4) వంటి సినిమాలు రెండేసి విడుదల తేదీలను ప్రకటించి అప్పటి పరిస్థితులను బట్టి ఏదోక తేదీకి విడుదల చేస్తామని తెలిపాయి. అయితే 'అంటే సుందరానికీ' మేకర్స్ మాత్రం ఏకంగా ఏడు విడుదల తేదీలు ప్రకటించారు.

ఈ ఆవకాయ సీజన్(సమ్మర్)లో వస్తున్నాం అంటూ తాజాగా ఓ పోస్టర్ ని విడుదల చేసింది 'అంటే సుందరానికీ' మూవీ టీమ్. ఆ పోస్టర్ లో "ఏప్రిల్ 22 లేదా, ఏప్రిల్ 29 లేదా, మే 6 లేదా, మే 20 లేదా, మే 27 లేదా, జూన్ 3 లేదా, జూన్ 10 వస్తున్నాం" అంటూ ఇలా ఏడు విడుదల తేదీలు ఉన్నాయి. ఏప్రిల్ 22 నుంచి జూన్ 10 వరకు వారం వారం గ్యాప్ తో విడుదల చేసిన ఈ ఏడు తేదీల్లో మే 13 మిస్ అయింది. మే 12 న మహేష్ బాబు 'సర్కారు వారి పాట' విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా కావడంతో.. ఒక్కరోజు తేడాతో తమ రెండు సినిమాలు విడుదల చేయకూడదన్న ఉద్దేశంతో.. ఆ విడుదల తేదిల్లో మే 13 ఇవ్వలేదని తెలుస్తోంది.
![]() |
![]() |