![]() |
![]() |

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం 'హరి హర వీరమల్లు' జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు మరో వారం రోజుల్లో థియేటర్లలో అడుగుపెట్టనుంది. నిజానికి ఈ సినిమా ఈసారైనా విడుదలవుతుందా లేక మళ్ళీ వాయిదా పడుతుందా? అని భయపడిన అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. ఇక వీరమల్లు ఆగమనం ఫిక్స్ అయింది. ఇలాంటి సమయంలో మూవీ టీం ఫ్యాన్స్ కి ఓ చిన్న షాక్ ఇచ్చింది. ఈసారి సినిమాని వాయిదా వేయలేదు కానీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఒకరోజు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. (Hari Hara Veera Mallu)
'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతి లేదా విజయవాడలో నిర్వహించాలని మొదట మేకర్స్ భావించారు. ఏవో కారణాల వల్ల ఆ రెండు చోట్ల కాకుండా.. జూలై 20న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ వైజాగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నట్లు సమాచారం. జూలై 21న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈవెంట్ జరపాలని మేకర్స్ నిర్ణయించారట. ఇది ఫ్యాన్స్ కి చిన్నపాటి షాక్ అని చెప్పవచ్చు. శిల్పకళా వేదిక అంటే భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశముండదు. పోలీసులు చాలా తక్కువ మందికే అనుమతి ఇచ్చే అవకాశముంది. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఈవెంట్ భారీస్థాయిలో జరగకపోవడం అభిమానులకు నిరాశ కలిగించే విషయమే.
![]() |
![]() |